వైభవంగా బాల ఏసు ఆలయ జెండా ప్రతిష్ట
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని బాల ఏసు దేవాలయంలో ఆదివారం జెండా ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. క్రీస్తు జయంతి మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆలయం వద్ద దివ్య పూజాబలి నిర్వహించారు. ప్రధాన యాజకులు ఫాదర్ తుమ్మా కరుణాకరరెడ్డి వాక్యోపదేశం చేశారు. ప్రతిఒక్కరూ భక్తి భావంతో ప్రార్థించాలన్నారు. అనంతరం క్రీస్తు జయంతి సందర్భంగా ఆలయం వార్షికోత్సవ పూజలకు నిదర్శనంగా ఫాదర్స్ బంగ్లా నుంచి జెండాను ఊరేగింపుగా బాల ఏసు దేవాలయం వరకు తీసుకొచ్చారు. ఆలయ విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి జెండాను ప్రతిష్ఠించారు. గుడిపెద్ద రామిశెట్టి చిన్నయ్యతో కొవ్వొత్తులను వెలిగించారు. ఫాదర్స్ బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఫాతిమా మర్రెడ్డి మాట్లాడుతూ.. బాల ఏసు దేవాలయం నిర్మించి ఇప్పటికి 140 ఏళ్లు పూర్తి అయినట్లు తెలిపారు. క్రీస్తు జయంతి పండుగ 23, 24, 25వ తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. సంబంధిత వాల్ పోస్టర్లు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. ఆలయ సహాయ విచారణ గురువులు బి.ప్రవీణ్ కుమార్, వి.రవీంద్ర, గుడి పెద్దలు కొమ్మారెడ్డి, చిన్నప్పరెడ్డి, శౌరిరాజు, రామిశెట్టి రాజశేఖర్, బందనాథం సతీష్‌బాబు, జె, ప్రకాష్, మరియన్న, థామస్, బాలస్వామి, చిన్నప్పరెడ్డి, సందీప్, జోషి, స్లేవయ్య, సుందరరావు, జోసఫ్‌రాజు, సుధ, అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment