ప్రభంజనం
ప్రమదగణాలు ప్రణవనాదంతో పరవశించాయా.. జంగమదేవర శంఖారావంతో దిక్కులు పిక్కటిల్లాయా.. అభిషేక ప్రియుని సిగన కృష్ణాజలాలు ఆనంద తాండవమాడాయా.. వేదమంత్రోచ్చరణలకు లయబద్ధంగా గుడిగంటలు మార్మోగాయా.. అన్నట్టు మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ఆధ్యాత్మికోత్సాహంతో ఉప్పొంగాయి. జనహృదయాలు మనోహరుడి ముందు ప్రణమిల్లాయి. పాహిమాం.. అహరహం రక్షమాం అంటూ శరణువేడాయి.
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు బుధవారం పోటెత్తారు. స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు బిందెతీర్థంతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామి దర్శనభాగ్యం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోపాన మార్గం నుంచి భక్తులు మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట, నంది విగ్రహం వద్ద భక్తులు పూజలు చేశారు. త్రిముఖ శివలింగం వద్ద యాత్రికులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పలువు రు భక్తులు కాలినడకన పాత కోటయ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. కొండ కింద నుంచి 65 సప్తగిరి బస్సుల్లో ఆర్టీసీ యాత్రికులను చేరవేసింది.
ప్రభల వద్ద కోలాహలం..
కోటప్పకొండకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీ విద్యుత్ ప్రభల వద్ద కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రభల నిధి వద్దకు 20 భారీ విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి. వీటి ముందు నిర్వహకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు.
వీఐపీ క్యూలైన్‌లో భక్తుల తోపులాట
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వీఐపీ దర్శన పాసులను అధికారులు భారీస్థాయిలో జారీ చేశారు. ఓపక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సుమారు 30 వేల వీఐపీ పాసులు జారీ చేశారని సమాచారం. ఫలితంగా పలుమార్లు ఈ క్యూలైన్‌లో తోపులాట జరిగింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీఐపీ క్యూలైన్లో వారిని వీవీఐపీ క్యూలైన్ లోకి అనుమతించారు. ఫలితంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వీవీఐపీలకు రూ.200 టికెట్ కొన్న భక్తుల క్యూలైన్ ఆపి దర్శనం కల్పించాల్సి రావడంతో ఆ క్యూలైన్‌లోని భక్తులు మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.
పెట్లూరువారిపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్
నరసరావుపేట మండలం పెట్లూరువారిపాలెం వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి పెట్లూరివారిపాలెం నుంచి కొండకు వెళ్లే దారులన్నీ స్తంభించాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు విమర్శించారు.
పోలీసు డ్రోన్‌కు ప్రమాదం
కోటప్పకొండ వద్ద శాంతి భధ్రతల పర్యవేక్షణకు పోలీసులు వినియోగించిన డ్రోన్‌కు ప్రమాదం జరిగింది. పైకి లేచిన డ్రోన్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. విద్యుత్ తీగలపై పడటంతో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు విద్యుత్ నిలిపివేయించి తీగలపై పడిన డ్రోన్‌కు కిందకు దించారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రి టీజీ భరత్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, కొలికిలపూడి శ్రీనివాసరావు, మాజీమంత్రి మేరుగ నాగార్జున, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్, పల్నాడు కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు తదితరులు స్వామిని దర్శించుకుని తరించారు.
కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా హాజరైన భక్తులు అధిక సంఖ్యలో వీఐపీ పాసుల జారీతో క్యూలైన్లలో రద్దీ కోటయ్యను దర్శనం చేసుకున్న రాజకీయ ప్రముఖులు భారీ విద్యుత్ ప్రభల వద్ద భక్తుల కోలాహలం పెట్లూరివారిపాలెం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Comments
Please login to add a commentAdd a comment