నేడు పాఠశాలలకు సెలవు
నరసరావుపేట ఈస్ట్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 27న గురువారం పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ బుధవారం తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు.
కాకతీయ కమ్మ సత్రానికి రూ.1.85 లక్షలు విరాళం
శావల్యాపురం: మండలంలోని పోట్లూరు గ్రామంలో కాకతీయ కమ్మ సేవా సమితి సారథ్యంలో కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా కాకతీయ కమ్మ సత్రానికి రూ. లక్షా 85 వేల 66 విరాళంగా అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఏటా గ్రామస్తుల సహకారంతో విరాళాల రూపంలో నగదు అందజేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.
వైభవంగా ఆది దంపతుల కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పర్యవేక్షణలో ఈ వేడుక వైభవంగా జరిగింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. మరో వైపు అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గాన్ని సైతం పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని మామిడి తోరణాలు, అరటి చెట్లతో పచ్చటి పందిరిని తలపించేలా తీర్చిదిద్దారు. మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని స్వామిని దర్శించుకుని అభిషేకాలు జరిపించారు.
రాజధానిలో
దొంగల కలకలం
తాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం నెక్కల్లులోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం నెక్కల్లు గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గేట్లు పగులగొట్టి ప్రవేశించి అమ్మవారి వెండి వడ్డాణం, కిరీటం, హుండిలో నగదు, కానుకలు, అపహరించారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సమాచారం తెలియకుండా ఉండేందుకు బాక్సులు సైతం తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూజారి గుమ్మా గంగయ్య రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పూజా కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం దేవస్థానానికి రాగా ఆలయం గేటు, తాళం, హుండీ తాళం పగులగొట్టి ఉండటం, పోలేరమ్మ విగ్రహంపై ఉన్న నగలు కనిపించకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
పట్నంబజారు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకాని రోడ్డులోని వేదాంత ఆసుపత్రి సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై నలుగురు వ్యక్తులు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనం ఢీకొందనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చల్లా వెంకటేష్ (15), లాలాపేటకు చెందిన షేక్ అబ్దుల్ అలీ (28) మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
నేడు పాఠశాలలకు సెలవు
Comments
Please login to add a commentAdd a comment