తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నుంచి వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఖాజావలి కథనం ప్రకారం కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ 8వ ఫ్లోర్‌లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
ప్రయాణికుడికి బ్యాగు అప్పగింత
ఇంకొల్లు(చినగంజాం): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండులోని కంట్రోలర్ తిరిగి అప్పగించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పంచాయతీ గుమస్తా జితేంద్రరెడ్డి ఆదివారం పని నిమిత్తం ఒంగోలు నుంచి ఇంకొల్లుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. బస్సులో బ్యాగును మరచిపోయారు. కంట్రోలర్ బాబుకు చెప్పడంతో వెంటనే ఆయన సదరు బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేసి బ్యాగు తిరిగి తెప్పించి యజమానికి అప్పగించారు.