
ప్రాణ సంకటం
● కుక్కల స్వైరవిహారం ● గుంటూరు ప్రజలు బెంబేలు ● గాలిలో పసిప్రాణాలు ● 2017లో కుక్కల దాడిలో ఓ బాలుడి మృతి ● కొద్దినెలల క్రితం బాలికపై దాడి ● తాజా ఘటనలో మరో బాలుడు బలి ● శునకాల బారిన పడుతున్న నగరవాసులు ● జీజీహెచ్‌కు వస్తున్న కేసులు ● చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికారులు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు కుక్కకాట్లకు బలవుతున్నారు. అయినా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి తాజాగా ఆదివారం స్వర్ణ భారతినగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ఐజక్ బలయ్యాడు. కుక్క గొంతుకరుచుకుని తీసుకుపోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 2017 డిసెంబర్‌లోనూ ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కుక్క కరవడంతో చనిపోయాడు. కొద్ది నెలల క్రితం సంపత్‌నగర్‌లో ఓ బాలికపై కుక్క దాడి చేసింది. స్థానికులు కుక్కను తరిమివేయడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఏడేళ్ల క్రితం హుస్సేన్‌నగర్, ఆంజనేయ కాలనీలో 9 మందిపై వీధి కుక్కలు దాడి చేసి కండలు పీకేశాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గుంటూరులో రోజూ ఏదోచోట కుక్కకాటుకు ప్రజలు బలవుతున్నారు. జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జనవరి 9 నుంచి ఆగిపోయిన ఏబీసీ ఆపరేషన్లు
గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం నగరపాలక సంస్థ గతంలో చర్యలు చేపట్టింది. ఏటుకూరు రోడ్డులో స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ (ఏబీసీ) ఆపరేషన్లు చేయించేది. ఈ ఆపరేషన్లు చేసినందుకు గాను ఒక కుక్కకు రూ.రెండు వేల వరకూ స్నేహ సంస్థకు చెల్లించేంది. అయితే నిబంధనలు పాటించకుండా ఆపరేషన్లు జరుగుతున్నాయని, స్టేరిలైజేషన్ సక్రమంగా ఉండటం లేదని, ఆపరేషన్ ద్వారా కుట్లు కూడా సక్రమంగా వేయడం లేదని, రికార్డ్స్ సక్రమంగా నిర్వహించడం లేదని కొందరు జంతుప్రేమికులు యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది అక్టోబర్ 18న గుంటూరుకు విచ్చేసిన యానిమల్ బోర్డ్ సభ్యులు స్నేహ సొసైటీ చేస్తున్న ఆపరేషన్లలో లోపాలున్నాయని గుర్తించి ఆపరేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో జనవరి 9 నుంచి ఏబీసీ ఆపరేషన్లు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ స్నేహ సంస్థ ఏబీసీ ఆపరేషన్లు చేసేందుకు అప్పీలు చేసుకోవడంతో జనవరి 24న యానిమల్ బోర్డ్ సభ్యులు గుంటూరు వచ్చి స్నేహ సంస్థ ఏబీసీ సెంటర్‌ను పరిశీలించారు. ఇంకా ఆపరేషన్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని సభ్యులు తేల్చారు. నగరపాలక సంస్థ తరుఫునే ఆపరేషన్ల చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు.
ఆపరేషన్లు చేయకుండానే బిల్లులు
అధికారుల లెక్కల ప్రకారం గుంటూరు నగరంలో 31,400 కుక్కలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 4,500 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసినట్లు చెబుతున్నారు. వీటి కోసం రూ.37,48,500 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే వీటిలో కూడా చాలా కుక్కలకు ఆపరేషన్లు చేయకుండానే చేసినట్లుగా బిల్లులు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ఇక్కడ ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓగా పనిచేసిన ఓ అధికారి ఆధ్వర్యంలో ఏబీసీ ఆపరేషన్ల విషయంలో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.