ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
మానకొండూర్: శంకరపట్నం మండలంలోని చింతగట్టు గ్రామానికి చెందిన కర్క మల్లారెడ్డి(68) రోడ్డు ప్రమాదంలో మృతిచెందా డు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. మల్లారెడ్డి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై మానకొండూర్ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో గల పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పె ట్రోల్ కొట్టించుకొని, తిరిగి వస్తుండగా శంషా బాద్ స్టేజి వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లారెడ్డి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్‌కు చెందిన శివరాత్రి స్వప్న(35) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్వప్నకు ఓ వ్యక్తి తరచూ ఫోన్ చేస్తున్నాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై, ఈ నెల 18న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
మానేరు వాగులో పడి వ్యక్తి..
సిరిసిల్ల క్రైం: తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లికి చెందిన జంగిలి అనిల్(37) మానేరు వాగులో పడి మృతిచెందాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. అనిల్ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌కు చాలా ఏళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. సెంట్రింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. స్వగ్రామం మండెపల్లిలో నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలిసి, చూసేందుకు వచ్చాడు. ఈ నెల 18న మానేరు వాగు కరకట్ట ప్రాంతానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం మానేరు వాగులో మృతదేహం తేలడంతో అనిల్‌దేనని గుర్తించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య గీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
గంజాయి విక్రేతల అరెస్టు
మంథని: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గురువారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయితో ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో ఎస్సై రమేశ్, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లారు. అనుమానాస్పదంగా కనిపించిన కూచిరాజ్‌పల్లికి చెందిన నక్క ప్రేమస్, లక్కేపూర్‌కు చెందిన మహమ్మద్ అర్షద్‌లను తనిఖీ చేయగా 1,232 గ్రాముల గంజాయి లభ్యమైంది. విచారణలో తాము ఐదేళ్లుగా గంజాయి తీసుకుంటున్నామని, మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి, స్నేహితులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఏసీపీ పేర్కొన్నారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment