
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జాగ్రత్తలు తీసుకోవడం ఆరంభించారు.ఆయన ఎంత భయపడకపోతే ప్రత్యేక కమిటీని నియమించుకుంటారు! గతం 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో పార్టీ నేతలు కొందరితో ఎన్నికల కమిటీని నియమించారు. నియోజకవర్గ ఇన్ చార్జీగా ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ కె.శ్రీకాంత్ ను పెట్టుకోవడం మరో విశేషం. కుర్రవాడైన ఇతనిని ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు తన నియోజకవర్గానికి బాద్యుడిగా పెట్టుకుని ఎన్నికలకు వెళుతుండడం విశేషం. ఇదంతా కుప్పంలో తాను ఎక్కడ ఓడిపోతానో అన్న భయంతోనే చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అందుకే ప్రత్యేక కమిటీ
గతంలో చంద్రబాబు కేవలం తన పీఏ మనోహర్ ద్వారా కథ నడిపేవారు. ఎన్నికల సమయంలో అవసరమైన డబ్బు,దస్కం అన్ని వ్యయం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకునేవారు. అలాంటిది ఎన్నికలకు ఏడాది ముందు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం, కుప్పం పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి మరో కమిటీని నియమించడం అన్నీ కూడా టీడీపీ అక్కడ బలహీనంగా ఉన్న సంగతిని తెలియచేస్తాయి. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే చంద్రబాబు నియోజకవర్గంలో పార్టీ బాధ్యులను ఎవరినైనా మార్చే అధికారం ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించారట. మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు ఆ ప్రాంతం వారైనప్పటికీ, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు అధికారం ఇవ్వడం కూడా గమనించవలసిన అంశం. కుప్పం ప్రాంతంవారిని నమ్మే పరిస్థితి చంద్రబాబుకు లేకపోయిందేమోనని అంటున్నారు.
1983లో కాంగ్రెస్ఐ తరపున చంద్రగిరిలో పోటీచేసి ఓడిపోయిన తర్వాత, టీడీపీలో చేరి బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవిర్గానికి మారి ఎమ్మెల్యేగా 1989 లో ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన అక్కడనుంచి ఎమ్మెల్యేగాగెలుస్తూ వస్తున్నారు. తనకు ఇంతకాలం ఎదురు లేకుండా ఆయన చేసుకోగలిగారు. కాని ఇప్పుడు కధ కొంత మారినట్లుగా ఉంది. అందుకే ఆయన తన సామాజికవర్గానికే చెందిన వేరే జిల్లాకు చెందిన వ్యక్తిని కుప్పంలో బాధ్యుడిగా నియమించడం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో 32 మందితో సమన్వయ కమిటీని వేశారు. సాధారణంగా పార్టీ బలహీనంగా ఉన్నచోటే ఈ స్థాయిలో కమిటీలు వేస్తుంటారు. చంద్రబాబు బిజీగా ఉంటారు కనుక ఈ ఏర్పాటు అని అనుకున్నా, గతంలో ఎప్పుడూ ఇలా కమిటీలు వేయలేదు కదా!వేరే జిల్లా వారిని తీసుకు వచ్చి ఇక్కడ పెత్తనం అప్పగించలేదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
బాబు నోట.. కుప్పంలో ఇల్లు అట..!
గత స్థానిక ఎన్నికలలో కుప్పం ప్రాంతం అంతా వైసీపీ వశం అవడం ఆయనకు ఆందోళన కలిగించింది. చివరికి కుప్పం మున్సిపాల్టీని వైసీపీ గెలుచుకోవడం పరువు తక్కువ అయింది. ఆ నేపద్యంలోనే చంద్రబాబు కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానని ప్రకటించారు. కొంత ఏర్పాటు కూడా చేసుకున్నారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆయన ఎప్పుడూ ఇల్లు కట్టుకోలేదు. ప్రస్తుతం ఓటమి భయం ఎదురు అవుతుండడంతో ప్రజలను తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు పులివెందులలో కూడా గెలుస్తామని బీరాలు పలుకుతూ, ఇంకో వైపు కుప్పం రాజకీయ పరిస్థితిపై ఆయన ఒకరకంగా వణుకుతున్నారని అనుకోవాలి. అంతేకాదు.ఆయా చోట్ల చంద్రబాబు ప్రసంగాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ను నోటికి వచ్చినట్లు తిడుతున్నారు.
కుప్పంలో ఓడిపోతాననే భావనలో..
చివరికి ప్రజలను కూడా దూషిస్తున్నారు. ప్రజలకు దయ్యం బట్టి వైసీపీని ఎన్నుకున్నారని అంటున్నారట. ఇప్పుడు కుప్పంలో కూడా ప్రజలకు దెయ్యం పడితే తనను ఓడిస్తారేమోనన్న భయం ఏర్పడి ఉండాలి. జగన్ అమలు చేస్తున్న వివిద సంక్షేమ పధకాల ప్రభావం కుప్పంలో కూడా ఉంది. కుప్పంలో వివిధ అభివృద్ది పనులకు జగన్ నిదులు మంజూరు చేశారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఆయనను పవర్ పుల్ నేతగా పరిగణిస్తారు. ఆయన పట్టుబట్టి తనను ఓడిస్తారన్న భావన చంద్రబాబులో ఉండడంతోనే ఈ ముందస్తు చర్యలని అంటున్నారు. ఇంత భారీ కమిటీని వేసి మొత్తం అధికారాలు శ్రీకాంత్‌కు అప్పగించడం ద్వారా ఇప్పటి నుంచే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయవచ్చని, అలాగే గతంలో మాదిరి మళ్లీ బోగస్ ఓటర్లను చేర్పించే యత్నం చేయవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.
బాబుకు భయం అంటే ఏమిటో చూపించారు..
ఇంతకాలం తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాల నుంచి జనాన్ని తెచ్చి బోగస్ ఓట్లు పోల్ చేయించేవారన్న ప్రచారం ఉంది. ఆ బోగస్ ఓట్లను ప్రస్తుత ప్రభుత్వం చాలావరకు తీసివేయించింది. దాంతో ప్రత్యామ్నాయ పద్దతులలో ఓటర్లకు అవసరమైన ఆర్దిక వనరులు సమకూర్చి ఇప్పటి నుంచే వారిని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ఇలా చేస్తున్నారా అన్న సంశయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తనకు కుప్పంలో ఎదురు లేదని అనుకునే చంద్రబాబుకు భయం అంటే ఏమిటో చూపించిన ఘనత మాత్రం జగన్దే అవుతుందన్న అబిప్రాయం వ్యక్తం అవుతోంది. చివరిగా మరో మాట. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆంబోతు అని చంద్రబాబు దూషిస్తే ఆయన టిట్ ఫర్ టాట్ అన్నట్లు సమాదానం ఇచ్చారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే వ్యక్తా అని రాంబాబు ప్రశ్నించారు. అంటే దాని అర్ధం తెలుస్తూనే ఉంది కదా! అధికార యావతో ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు ఎదుటివారితో తిట్టించుకుంటున్నారు. ఎంత అప్రతిష్ట!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్