
కాకి లెక్కలు చెప్పడంలో తండ్రిని మించిపోవాలని ఆంధ్రప్రదేశ్ షాడో సీఎం, విద్యాశాఖ మంత్రి లోకేష్ తహతహలాడుతున్నట్లు అనిపిస్తోంది. సర్వ మంత్రిత్వ శాఖలపై పెత్తనం చెలాయిస్తున్న ఈయన ఇటీవలే ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఏమిటా ట్వీట్ అంటే.. ‘వైఎస్ జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే రూ. 24,944 కోట్లు’ అని!. దీంతో, అవకాశం దొరికిందనుకుందేమో.. ‘ఈనాడు’ మరింత రెచ్చిపోయింది. తప్పుడు కథనాల వండి వార్చేసింది. నిజానిజాలను నిర్ధారించుకుని మరీ వార్తలు రాయాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని గాలికి వదిగేసింది. యాభై ఏళ్లపాటు మనుగడలో ఉన్న ఈనాడు ఈ స్థాయికి దిగజారుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి?.
లోకేష్ ట్వీట్‌కు సంబంధించిన కథనానికి ఈనాడు పెట్టిన శీర్షిక చదివితే జగన్ హయాంలో తెచ్చిన అప్పులకే రూ.24,944 కోట్ల వడ్డీ కట్టాలనేమో కదా! అయితే వాస్తవం ఇది కాదు. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ ఇది. అంత మొత్తాన్నీ వైఎస్ జగన్ ఖాతాలోకి వేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది ఈనాడు కుత్సిత వ్యూహం!.
లోకేష్ తన ట్వీట్‌లో 2019 వరకు ఉన్న అప్పులపై వడ్డీని, జగన్ హయాంలో తెచ్చిన అప్పులపై వడ్డీని పోల్చుతూ కొంత మిస్ లీడ్ చేసే యత్నం చేస్తే.. ఈనాడు మీడియా అబద్ధపు హెడ్డింగ్ పెట్టి మొదటి లైన్‌లో ఇలా రాసింది. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులపై కడుతున్న వడ్డీ రూ.24,944 కోట్లకు చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు’ అని! ఆ వెంటనే ‘2019 నాటికి మొత్తం అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ రూ.14,155 కోట్లు. దీని కంటే జగన్ పాలనలో చేసిన అప్పులపై కడుతున్న వడ్డీనే అధికం అని లోకేష్ పేర్కొన్నారు’ అని రాసింది. మొదటి వాక్యంలో మొత్తం వడ్డీ అంతా జగన్ ఖాతాలో వేసేసింది?. అదంతే.. ఈనాడు బుద్దే అలా చెడిపోయిందని అనుకోవాలి.
ఇక లోకేష్ విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే 2019 వరకు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెచ్చిన అప్పులపై రూ.14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా, జగన్ హయాంలో రూ.24 వేల కోట్లకు చేరిందీ అని చెప్పారు. అదే టైమ్‌లో ఆయన పోల్చవలసింది చంద్రబాబు ఉమ్మడి ఏపీతోపాటు విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పులెంత? అన్నది విభజిత ఏపీలో 2014-19 మధ్య ఎంత అప్పు తీసుకు వచ్చారన్నది కదా!. అదేమీ చెప్పకుండా లోకేష్ అతి తెలివిని ప్రదర్శించారు.
ఈ అంశంపై నెటిజన్లు లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ బాబూ.. అసలు నిజం చెబుదామా? అంటూ వాయిస్ ఆంధ్ర పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఇలా ప్రస్తావించారు. 2014-19 చంద్రబాబు హయాంలో అప్పుల భారం ₹97,000 కోట్ల నుంచి ₹3,46,529 కోట్లకు పెరిగింది! (సోర్స్: CAG & RBI).
అప్పుల భారం మూడింతలు చేసిన చంద్రబాబు, వడ్డీ పెరిగింది అని జగన్‌పై బురదజల్లడం కామెడీ కాదా?. 2019 నాటికి అప్పులపై కట్టిన వడ్డీ ₹14,154 కోట్లు. అదే 2024 నాటికి ₹24,944 కోట్లు. వడ్డీ పెరగడానికి కారణం 2014-19 మధ్య టీడీపీ చేసిన భారీ అప్పులే కదా?. జగన్ పాలనలో అప్పులు వచ్చాయి కానీ, సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ టీడీపీ హయాంలో అప్పు చేసి.. కమీషన్లు, కాంట్రాక్టర్లు, సింగపూర్ ట్రిప్పులకే ఖర్చు పెట్టారు. అని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో 'అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చారు.. మరి మీ సూపర్ సిక్స్ ఏది మరి? అని ఇంకొకరు ప్రశ్నించారు. వాస్తవాలు చెబితే మైండ్ బ్లాంక్ అవుతుందా బాబూ? అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు సంధించింది. 'YSRCP హయాంలో ప్రజల జీవితం మెరుగుపడింది. కానీ టీడీపీ హయాంలో మాత్రం అప్పులూ, అవినీతీ తప్ప మిగలలేదు! అని ఆ పోస్టులో వ్యాఖ్యానించింది.
ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి విభజిత ఏపీ అప్పు పై ఏడాదికి రూ.7488 కోట్లు చెల్లిస్తుండగా, 2019 నాటికి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు కూడా కలిపి కట్టవలసిన వడ్డీ రూ.15,342 కోట్లు. అంటే అంతకుముందు ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుకన్నా మూడు రెట్లు అధికంగా రుణాన్ని తీసుకురావడమే కాకుండా, డబుల్ మొత్తాన్ని వడ్డీగా చెల్లించవలసి వచ్చిన లెక్కలను వైఎస్సార్‌సీపీ నేతలు తమ సమాధానాలలో వివరించారు. 2019లో అప్పును మూడున్నర లక్షల కోట్లకు తీసుకువెళ్లి కూడా చివరకు జగన్ పదవిలోకి వచ్చే నాటికి వంద కోట్లు మిగిల్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
అప్పుడు జగన్ జీతాలు కూడా ఇవ్వలేరని టీడీపీ నేతలు భావించి ప్రకటనలు కూడా చేశారు. దానిని కదా ఆర్థిక విధ్వంసం అనాల్సింది? ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనా ఉన్నా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు అమలు చేసిన చరిత్ర జగన్‌ది. అంతేకాదు.. జగన్ దిగిపోయే నాటికి ఏడువేల కోట్లు ఖజానాలో ఉంచి వెళ్లారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేయకుండా, అప్పులు మాత్రం రూ.1.30 లక్షల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది అని వైఎస్సార్‌సీపీ నేతలు వాదించారు. ఇది నిజమే.
జగన్ టైమ్‌లో అన్ని పథకాలు అమలై, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా భవనాలు నిర్మించినా ఆర్థిక విధ్వంసం అని టీడీపీ కూటమి దుష్ప్రచారం చేస్తుంటుంది. మరి ఈ ఎనిమిది నెలల కాలంలో కాని, అంతకుముందు 2014 టర్మ్‌లో ఐదేళ్లలో కాని నిర్దిష్టంగా ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీది. అప్పుడు రుణమాఫీతో సహా వందల హామీలు అమలు చేయకుండా కాలం గడిపారు. ఇప్పుడు సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం గల్లాపెట్టె ఖాళీ అంటూ కథలు చెబుతూ, మరోవైపు ధారాళంగా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది.
2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేశారు. తీరా చూస్తే అది రూ.ఏడు లక్షల కోట్లు కూడా లేదు. అందులో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో వచ్చిందే సుమారు రూ.మూడు లక్షల కోట్లు ఉంది. అయినా దాని గురించి చెప్పకుండా మొత్తం జగన్ అకౌంట్‌లోవేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుంటారు. అదేకాదు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం జగన్ టైమ్‌లో జీఎస్డీపీ, జీఎస్టీలలో ఏపీలో వృద్దిలో ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో మైనస్‌లోకి వెళ్లింది.
జగన్ టైమ్ లో మైనింగ్ శాఖలో 2023-24లో ఆదాయం రూ.4800 కోట్లు కాగా, అది చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వరకే ఉందట. చంద్రబాబు 2014 టర్మ్‌లో మైనింగ్ శాఖ ఆదాయం రూ.8161 కోట్లు ఉంటే, జగన్ ఐదేళ్లలో రూ.17,732 కోట్ల ఆదాయం సాధించింది. అయినా కూటమి నేతలు జగన్ టైమ్ లో ఆర్థిక విధ్వంసం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తారు. దానివల్లే తాము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక పోతున్నామని ప్రజలను ఏమార్చే యత్నం చేస్తున్నారు.
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మొనగాడు అని దేశవ్యాప్తంగా ఆయా పార్టీల వారు భావిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. వారిద్దరితో పోటీ పడి లోకేష్ కూడా తనకు తోచిన అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో ఉండాలని తలపెట్టినట్లు అనిపిస్తుంది. ఒకవైపు కుంభమేళాలో పుణ్యస్నానాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చిన లోకేష్ ఇలాంటి అసత్యాలను చెబితే పాపం అనిపించదా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment