ఆపద్బాంధవి
ఆపదలో
ఆపదలో ఉన్న వారికి అత్యవసర వైద్యం కోసం ఠక్కున గుర్తుకొచ్చే ఆపద్బాంధవి 108కే ఆపద ఎదురైంది. ఓ వైపు సిబ్బంది కొరత వేధిస్తుండగా మరో వైపు ఉన్న వారికీ జీతాలు సక్రమంగా రావడం లేదు. సిబ్బంది లేరన్న సాకుతో సెలవులు లేక ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించి 108 సర్వీసులను గాడిలో పెట్టాలని ఉద్యోగులు నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఒంగోలు టౌన్: 108.. ఈ పేరు వింటేనే చాలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కుయ్ కుయ్‌మంటూ వచ్చే అంబులెన్స్ కళ్ల ముందు కదలాడుతుంది. ఎక్కడైనా సరే...ఎవరికై నా సరే ...ఎలాంటి ప్రమాదం ఏర్పడినా, అత్యవసర ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే 108కు ఫోన్ చేయడం గత 20 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు అలవాటైపోయింది. ముఖ్యంగా నిరుపేద సామాన్య ప్రజలకు 108 ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు. అలాంటి 108 ఇప్పుడు సమస్యల సుడిగుండంలో పడిపోయింది. ఒకవైపు సిబ్బంది కొరత వేధిస్తుంటే మరోవైపు సకాలంలో వేతనాలు రాక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కీంలో భాగంగా అరబిందో ఉద్యోగులుగా పరిగణించబడుతున్న వీరికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇక వేల కిలో మీటర్లు తిరిగిన వాహనాలు కుయ్యో మొర్రో అని మొరాయిస్తుంటే భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా 108 ఉద్యోగులను కదిలిస్తే ఎన్నో సమస్యలు... మరెన్నో ఇబ్బందులు చెబుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టించుకునే తీరిక లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న బాధ్యత మరిచి రాజకీయాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. సిబ్బంది సమస్యలను వదిలేసి అరబిందో వెనకబడింది. దాంతో 108 ఉద్యోగులు మరింతగా సమస్యల్లో కూరుకుని పోయారు. ఈ నేపథ్యంలో గత సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వేడుకున్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. సహనం నశించిన ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
38 మండలాలు...40 వాహనాలు:
జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 40 నూటెనిమిది వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయి. మండలానికి ఒకటి చొప్పున 38 వాహనాలు ఉండగా మార్కాపురంలో నవజాత శిశువులు అత్యవసర సేవల కోసం అప్పటి ప్రభుత్వం ఒక వాహనాన్ని కేటాయించింది. సాధారణ ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కేటాయించారు. దాంతో మొత్తం 40 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 35 వాహనాలు పనిచేస్తుండగా 5 వాహనాలకు మాత్రం మరమ్మతులు జరుగుతున్నాయి. 2023లో అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 కొత్త వాహనాలను జిల్లాకు కేటాయించింది. లేకపోతే పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉండేది. ప్రతి అంబులెన్స్‌లోనూ 2.5 రేషియో ప్రకారం ఒక ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్, ఒక పైలట్ ఉంటారు. జిల్లాలో 200 మంది సిబ్బందికి గాను 185 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 95 మంది ఈఎంటీలు కాగా, 90 మంది పైలట్లు ఉన్నారు. 8 మంది పైలట్లు, ఏడుగురు ఈఎంటీ సిబ్బంది అవసరం ఉంది.
సెలవులు లేక ఒత్తిడికి
గురవుతున్న ఉద్యోగులు...
జిల్లాలో 108లో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. లేబర్ యాక్టు ప్రకారం 48 గంటలకు ఒక వీకాఫ్ ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరతతో 96 గంటలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి సిబ్బంది లేరన్న సాకులు చెబుతూ సెలవులు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసర పనుల మీద సెలవు పెట్టాలంటే తనకు బదులుగా మరొకరిని చూపిస్తేనే కానీ సెలవులు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
రిఫర్ కేసులకు ప్రాధాన్యత...
జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చిన కేసులను గుంటూరుకు రెఫర్ చేస్తారు. దాంతో వారిని 108 వాహనంలో గుంటూరు తీసుకెళ్తున్నారు. ఇది అత్యవసర సేవలకు ఇబ్బందిగా మారిందని 108 ఉద్యోగులు చెబుతున్నారు. నిజానికి రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, కాన్పులు, పాముకాటు, తేలుకాటు, క్రిమి సంహారక మందులు తీసుకొని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసినప్పుడు వారిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించడం 108 లక్ష్యం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కిడ్నీ డయాలసిస్ రోగులను తీసుకొచ్చి, తిరిగి ఇంటి దగ్గర వదిలి పెట్టి రావడం, ఇతర చిన్న చితకా కేసుల్లో గుంటూరుకు రోగులను తీసుకెళ్లడం లాంటి పనులకు 108 ను వినియోగించడం వలన అత్యవసర సమయంలో ఏదైనా ఫోను వచ్చినా, ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని పైలట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒంగోలు జీజీహెచ్ నుంచి గుంటూరుకు కేసులను వైద్యులు రెఫర్ చేస్తున్నారు. ఏ మాత్రం క్రిటికల్ కేసులు వచ్చినా గుంటూరుకు రెఫర్ రాసేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. అలాగే మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నుంచి ఒంగోలుకు రెఫర్ చేస్తున్నట్లు సమాచారం. దానివలన ప్రాణాపాయంలో ఉన్న ఇతర రోగులకు అంబులెన్సు అందుబాటులో లేకుండా పోతోంది. జీజీహెచ్ అధికారులు ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
108 ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయించడం దారుణం
108 ఉద్యోగుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంది. కానీ 108లో మాత్రం 12 గంటలు పని చేయిస్తున్నారు. అదనపు పనికి ఎలాంటి అదనపు వేతనం కూడా చెల్లించకపోవడం దుర్మార్గం. కార్మికుల దగ్గర నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ తాలుకు సొమ్మును వసూలు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. రాష్ట్రంలో వందలాది సంస్థలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి 108 ను నిర్వహించడం ఒక లెక్కలోనిది కాదు. సొంత వ్యక్తులకు సంపాదించి పెట్టడం కోసమే ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. దానికి బదులుగా ప్రభుత్వమే 108ను నిర్వహించాలి.
– వెన్నా గాలిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్
సమ్మె బాటలో 108 ఉద్యోగులు
108 సర్వీసులోని ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, 108ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్నారు. పీఎఫ్, ఎర్న్‌డ్ లీవులకు సంబంధించి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలని కోరుతున్నారు. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజి మార్కులు ఇచ్చి 108 ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ నెల 24 లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 25వ తేదీ తరువాత ఏ క్షణంలోనైనా సమ్మెలోకి వెళ్లాలని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ముందస్తు నోటీసులు అందజేశారు.
సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న 108 జీతాలు సక్రమంగా రాకపోవడంతో ఉద్యోగులకు తప్పని తిప్పలు సెలవులు లేక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ప్రభుత్వమే 108ను నిర్వహించాలని విన్నపం 108 ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 25 తరువాత సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం
అడ్రసు లేకుండా పోతున్న 108 వాహనాలు
ప్రమాదం జరిగిన వ్యక్తిని కానీ, గుండెపోటు లాంటివి వచ్చిన వ్యక్తిని కానీ సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అప్పుడే బాధితుడు బతికే అవకాశాలు మెరుగుపడతాయి. స్వతహాగా వైద్యుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పరిస్థితిని గమనించి 108 అత్యవసర సేవలకు రూపకల్పన చేశారు. లక్షల మంది ప్రాణాలను 108 వాహనాలు కాపాడుతున్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. అత్యవసర సమయంలో ఫోన్లు చేస్తే 108 వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా వస్తున్నాయి. అప్పటికే సమయం మించిపోతుంది. బాధితులు ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇప్పుడు 108 వాహనాల కోసం ఎదురు చూడడం మాని ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే ఆటోల్లో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 108 కునికిపాట్లు పడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment