అత్యాచారాలు అరికట్టడంలో పాలకుల వైఫల్యం
● విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు విఫలమయ్యారని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన లైంగికదాడిని ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వాల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సెంటర్, ప్రకాశం పంతులు విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి ఘటన మరవక ముందే లా విద్యార్థినిపై క్రూరమైన దాడి చేయడం అమానుషం అన్నారు. విశాఖ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న దాడుల్లో మహిళలు బలి పశువులుగా మారారని, ఈ ఘటనల మీద అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా మత్తు పదార్థాలను చెలామణి చేయడం వలన యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలై మహిళలపై పాశవికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్న కూటమి మాటలు గాలిలో కలిసిపోయాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ విమర్శించారు. పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని, పోక్సో చట్టం ద్వారా విచారణ చేపట్టాలని, జస్టిస్ వర్మ సిఫారుసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు మాలతి, నాగుర్, ఆదిలక్ష్మి, గోవిందమ్మ, పెద గోవిందమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల విజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment