సర్కారీ వైద్యం.. నామమాత్రం!
దర్శి:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలందించాల్సిన డాక్టర్లలో కొందరు ప్రైవేట్ సేవల్లో మునిగితేలుతున్నారు. ఆన్ డ్యూటీ పేరుతో వైద్యశాలకు డుమ్మా కొట్టి సొంత ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి హాజరు రిజిస్టర్‌లో దర్జాగా సంతకాలు చేసి వెళ్తున్నారు. జిల్లా ఆస్పత్రులతోపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వేతనం పొందుతూ కాలం గడిపేస్తున్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ కొరవడటంతోనే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జీజీహెచ్, మార్కాపురంలోని జీజీహెచ్‌తోపాటు, 64 పీహెచ్‌సీలు, 19 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆస్పత్రి పని వేళల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న తీరుపై జిల్లాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా వైద్యశాలలు నిర్వహించడం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో సర్కారీ ఆస్పత్రుల్లో సక్రమంగా సేవలందడం లేదు. వైద్యులు లేకపోవడంతో నర్సులు ఇచ్చిన మాత్రలు తీసుకుని తమను తాము నిందించుకుంటూ పేదలు ఇంటి బాట పడుతున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతున్న తీరు ఇదీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
చందలూరు పీహెచ్‌సీలో సేవలు దైన్యం
దర్శి మండలంలోని చందలూరు పీహెచ్‌సీలో వైద్యులు విధులకు సక్రమంగా రాకపోవడంతో రోగులకు నర్సులే మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒక్కరు కూడా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. వైద్యులు ఎందుకు రావడం లేదని స్థానిక సర్పంచ్ భర్త పీహెచ్‌సీ సిబ్బందిని పలుమార్లు ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది.
ఇష్టారీతిగా సంతకాలు
డాక్టర్ బ్లెస్సీ ఆగస్టులో 15వ తేదీ వరకు మాత్రమే హాజరైనట్లు సంతకాలు ఉన్నాయి. సిబ్బంది మాత్రం ఆగస్టు 25వ తేదీ వరకు సంతకాలు పెట్టారు. డాక్టర్ బ్లెస్సీ మాత్రం నెలాఖరున వచ్చి అన్ని సంతకాలు పెట్టుకుని వెళ్లడం గమనార్హం. సెప్టెంబర్‌లో 10వ తేదీ వరకు డాక్టర్ బ్లెస్సీ సంతకాలు పెట్టి ఉండగా సిబ్బంది 20వ తేదీ వరకు సంతకాలు చేశారు. అక్టోబర్‌లో కూడా ఆమె 7వ తేదీ వరకు మాత్రమే సంతకాలు చేయగా సిబ్బంది మాత్రం 18వ తేదీ వరకు పెట్టారు. నవంబర్‌లో కూడా ఈ డాక్టర్ 15వ తేదీ వరకు మాత్రమే సంతకాలు పెట్టగా సిబ్బంది మాత్రం 20వ తేదీ వరకు సంతకాలు పెట్టారు. సంతకాలు లేని చోట సీఎల్ అని రాయాల్సి ఉన్నా ఖాళీగా వదిలేయడం గమనార్హం. డీఎంహెచ్‌ఓ తమ బంధువని చెప్పుకుంటూ పీహెచ్‌సీకి రాకుండా ప్రైవేట్ వైద్యశాలల్లో పని చేస్తున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. తమకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఈ వైద్యురాలిని చూసి మరో వైద్యుడు కూడా రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతున్నారు. ఈయన సొంత వైద్యశాల నిర్వహణకే పరిమితం అవుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వైద్యురాలి భర్త కూడా ఉప్పలపాడు పీహెచ్‌సీలో డాక్టర్ కాగా దర్శిలోని శివరాజనగర్‌లో ఒక వైద్యశాల నిర్వహిస్తూ మరో ప్రైవేట్ వైద్యశాలలోనూ పనిచేస్తున్నారు. ఈ తరహాలోనే జిల్లాలోని పలువురు ప్రభుత్వ వైద్యులు పనిచేస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
పీహెచ్‌సీల్లో పేదలకు సక్రమంగా అందని వైద్య సేవలు
ప్రైవేట్ సేవల్లో తరిస్తున్న కొందరు ప్రభుత్వ వైద్యులు
వైద్య సిబ్బందితో రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్న వైనం
చుట్టపుచూపుగా వచ్చి రిజిస్టర్‌లో ఒకేసారి సంతకాలు
డీఎంహెచ్‌ఓ చూసీచూడనట్లు
వ్యవహరిస్తున్నారని విమర్శలు
నీరుగారిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం
పేదల గడప వద్దకే ఉన్నత వైద్యం అందించాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా, పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదైనా కనీసం వైద్య శిబిరాలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అత్యవసర మందుల సరఫరా కాంట్రాక్టును ఇటీవల పాత పద్ధతిలోకి మార్చడంతో ఆస్పత్రుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలు నిర్వహించకుండానే రికార్డుల్లో మాత్రం సేవలందించినట్లు చూపెడుతుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment