కూటమి దగా | - | Sakshi
Sakshi News home page

కూటమి దగా

Published Fri, Dec 13 2024 1:08 AM | Last Updated on Fri, Dec 13 2024 1:18 AM

కూటమి

కూటమి దగా

రైతులపై పగ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఇంత వరకు నెరవేర్చలేదు. గత ప్రభుత్వంలో ఠంఛనుగా అందిన రైతు భరోసా పథకం ఊసే లేకపోగా ఉచిత పంటల బీమా పథకానికీ మంగళం పాడింది. పెట్టుబడి సాయం అందక రైతులు అల్లాడుతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక దళారుల చేత చిక్కి రైతులు విలవిల్లాడుతున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు వ్యతిరేక చర్యలతోనే పాలన సాగిస్తున్నాడు. రైతులను దగాచేసిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నేడు కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన గళం వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఒంగోలు సబర్బన్‌: రైతులను వంచించటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు.. అధికారంలోకి రాకముందు ఒకమాట.. అధికారం చేపట్టిన తరువాత మరో మాట మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏరు దాటే దాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తరువాత బోడి మల్లన చందంగా ఉంటుంది చంద్రబాబు నైజం. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను ఒక పక్క మోసం చేస్తూనే మరో వైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా ప్రతినిధులు, సానుభూతిపరులపై కేసులు పెట్టుకుంటూ కక్షసాధింపు చర్యలతో పాలన కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు ఇన్ని అకృత్యాలు చేస్తున్నా కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నాయకులు కూడా పన్నెత్తి మాట అనటం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. అయినా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా అందలం ఎక్కించిన జనాలను నిలువునా మోసగిస్తున్నారు.

ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం ఏదీ..

2024 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రతి రైతుకు ఏడాదికి వ్యవసాయ పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయింది. రబీ సీజన్‌ ప్రారంభమైంది. కానీ పెట్టుబడి సాయం చేస్తానని చెప్పిన మాటలు మాత్రం విస్మరించారు. దాంతో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని ఎన్నికల హామీల్లో పొందుపరచటమే కాదు, బహిరంగ సభల్లో, ఉపన్యాసాల్లో ఊదరగొట్టారు. కానీ జిల్లాలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఖరీఫ్‌లో ముందుగా సాగు చేసుకున్న రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటూ దళారుల చేతుల్లో విలవిల్లాడుతున్నారు. క్వింటా రూ.1650 కి అమ్ముకోవాల్సి ఉంటే రైతులు రూ.1200 నుంచి రూ.1300 మధ్యలో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే క్వింటాకు రూ.300 నుంచి రూ.400 వరకు రైతులు నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తోంది. దాంతో రైతులు కూటమి ప్రభుత్వ పాలన చూసి రగిలిపోతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే ప్రతి రైతుకు రూ.10 వేలు అందేది..

అదే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉండి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయి ఉంటే జిల్లాలోని ప్రతి రైతుకు ఇప్పటికే రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందేది. రైతు భరోసా పథకం–పీఎం కిసాన్‌ కింద జిల్లాలోని రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెలలోనే మొదటిసారి పెట్టుబడి సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. నవంబర్‌ పూర్తయ్యేలోపు అంటే రబీ సీజన్‌ ప్రారంభ సమయంలోనే పెట్టుబడి సాయం అందేది. అంటే మొత్తం మీద నవంబర్‌ పూర్తయ్యేసరికి దాదాపు మూడు విడతలుగా రూ.10 వేలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి. ప్రతి ఖరీఫ్‌ సీజన్‌ 2,84,113 రైతు కుటుంబాలకు రైతు భరోసా పథకం కింద, రబీ సీజన్‌లో 3.10 లక్షల మందికి కూడా రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతులకు అందుతూ వచ్చేవి. ఆ విధంగా 2019 నుంచి 2023 వరకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రూ.1634.85 కోట్లు జిల్లాలోని రైతులకు ఇచ్చారు. మరి అంతకంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు ఖరీఫ్‌, రబీ సీజన్‌ పూర్తి కావస్తున్నా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రైతుల ముఖం కూడా చూడటం లేదు. 2023లో జిల్లాలో ఖరీఫ్‌ లక్ష్యం 2.03 లక్షల హెక్టార్లు, 2023–24 రబీ లక్ష్యం 1.16 లక్షల హెక్టార్లు ఉంది. 2024–25 రబీ లక్ష్యం 2.39 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 1.02 లక్షల హెక్టార్లలోనే సాగైంది.

బీమా భారం రైతులపైనే..

అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోతే వారిని ఆదుకునేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పంటల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. అలాంటిది చంద్రబాబు ఆ పథకాన్ని ఎత్తేసి బీమా ప్రీమియంను రైతుల నెత్తిన రుద్దాడు. చేసేదిలేక రైతులే పంటల బీమా ప్రీమియం సొమ్మును ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కడుతున్నారు. సాగుఖర్చులకే డబ్బులు లేక అవస్థలు పడుతున్న రైతులకు బీమా ప్రీమియం చెల్లింపు మరింత భారంగా మారింది. నవంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈనెల కురిసిన ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఫెంగల్‌ తుఫాన్‌తో జిల్లాలో 10,336 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పడంతో చాలా మంది రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో వారికి పంటనష్ట పరిహారం కూడా అందే పరిస్థితి లేదు.

జిల్లాలో మొత్తం రైతులు: 2,84,113

వైఎస్సార్‌ సీపీ హయాంలో రైతు భరోసా కింద ఇచ్చిన నగదు: రూ.1634.85 కోట్లు

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన చంద్రబాబు అందని పెట్టుబడి సాయం.. ఉచిత పంటల బీమాకు మంగళం ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కక దళారుల చేతుల్లో రైతుల విలవిల రైతులకు భారంగా మారిన పంటల బీమా ప్రీమియం గత వైఎస్సార్‌ సీపీ పాలనలో జిల్లాలో రైతు భరోసా కింద రూ.1634.85 కోట్ల సాయం అన్నదాతకు అండగా వైఎస్సార్‌ సీపీ చంద్రబాబు నయవంచనపై నేడు ఒంగోలులో మహా ధర్నా

ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలపై గళమెత్తిన వైఎస్సార్‌ సీపీ

కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రైతులకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌ సీపీ గళమెత్తింది. జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులతో కలిసి జిల్లా కేంద్రం ఒంగోలులో కలెక్టరేట్‌ ముందు నేడు ధర్నాకు పూనుకుంది. చంద్రబాబు నయవంచనను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.

రైతులకు భరోసా కరువు

పొలంలో వేసిన మినుము పంట ఎండిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. నష్టపరిహారం అందుతుందో లేదో తెలియని పరిస్థితి. రైతులకు గత ప్రభుత్వంలో పంటల బీమా, పంట నష్టపరిహారం అందుతుండటంతో కొంత వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితులు లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

– వరికుంట్ల పెద్దకోటేశ్వరరావు, రైతు, రావిపాడుగ్రామం, కంభం మండలం

కూటమి ప్రభుత్వంలో రైతులకు మొండి చెయ్యి

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు, పంటల బీమా, పంట నష్ట పరిహారం డబ్బులు పడేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా డబ్బులు పడలేదు. అసలు ఎప్పుడు పడతాయో అధికారులకే తెలియడం లేదు. సరైన సమయంలో వర్షాలు లేక రైతులు కరువుతో అల్లాడుతున్నారు.

– గొంగటి చిన్నరామిరెడ్డి, రైతు, జంగంగుంట్ల, కంభం మండలం

ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులు పండించిన పంటలో 30 శాతం పంటని రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసింది. మిగిలిన పంటలో రైతుకు లాభాలు వచ్చేవి. ప్రభుత్వం కొన్న సరుకుని గోడౌన్లలో నిల్వ ఉంచి మార్కెట్‌లో ధర వచ్చినప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ విధానం వల్ల జగన్‌ పాలనలో స్వర్ణయుగంగా ఉండేది. ఏ రోజు రైతు రోడ్డు ఎక్కలేదు. అందుకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.

– మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పొగాకు బోర్డు మెంబర్‌

10 ఎకరాల పంట నష్టపోయాను

నేను 10 ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు చేశాను. ఒక్కొక్క ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. పప్పుశనగ సాగు చేసిన నెల రోజులకే అకాల వర్షాలు రావడంతో 10 ఎకరాల్లోని పంట పూర్తిగా నష్టపోయాను. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా.

– సూరా గురువారెడ్డి, పోసుపల్లె గ్రామం, కొమరోలు మండలం

రైతుల గోడు పట్టని ప్రభుత్వం

ఎన్నికలకు ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడా విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. సూపర్‌ సిక్స్‌ లో రైతు భరోసా చాలా కీలకమైన హామీ. 6 నెలలు గడుస్తున్నా వాటి గురించి మాట్లాడటం లేదు. జిల్లాలో రైతులు ఈ ఏడాది అతివృష్టితో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అన్నదాతలను ఆదుకోవాలి.

– కంకణాల ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఒంగోలు

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి దగా1
1/7

కూటమి దగా

కూటమి దగా2
2/7

కూటమి దగా

కూటమి దగా3
3/7

కూటమి దగా

కూటమి దగా4
4/7

కూటమి దగా

కూటమి దగా5
5/7

కూటమి దగా

కూటమి దగా6
6/7

కూటమి దగా

కూటమి దగా7
7/7

కూటమి దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement