తల్లిదండ్రులకు కడుపు కోత
ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): పరిగెడుతూ పడిపోతేనే ఆ దెబ్బలకు తాళలేరు. ఆ అబ్బాయి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఎంత వేదన అనుభవించాడోగానీ చనిపోదామని నిశ్చయించుకుని దూకేసినా.. కొనఊపిరితో ఉన్నప్పుడు బతకాలని ఆశపడ్డాడు. శ్రీనన్ను బతికించండి.. నన్ను బతికించండి.. ప్లీజ్..శ్రీ అంటూ స్నేహితులు, వైద్యులను వేడుకున్నాడు. కానీ, ఆ బిడ్డ ప్రాణం నిలబడలేదు. తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తూ బంగారం లాంటి బతుకును బలి చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కాలేజీలో చదువుతున్న ఆర్.ప్రవీణ్ నాయక్ (18) బుధవారం అర్ధరాత్రి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం పీఆర్‌సీ తండా. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్‌ఎం పురం క్యాంపస్‌లో బుధవారం అర్ధరాత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న విద్యార్థులకు ఒక్క సారిగా శబ్ధం వినిపించింది. వారంతా వచ్చి చూడగా ప్రవీణ్ నాయక్ రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే అతడిని క్యాంపస్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు సిబ్బంది తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాల ధనబాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ ఆస్పత్రికి వెళ్లారు. విద్యార్థి తల్లిదండ్రులు రవీంద్ర నాయక్, విజయాబాయిలకు ఫోన్ చేసి చెప్పారు. 2021లో ఈ విద్యార్థి ఇక్కడ చేరాడు. రెండేళ్ల పీయూసీ విజయవంతంగా పూర్తిచేసుకున్నాడు. సివిల్ ఇంజినీరింగ్‌లో చేరి చక్కగా చదువుకుంటున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు కూడా సాధిస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవడాన్ని స్నేహితులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విద్యార్థి మూడో బ్లాక్‌లో ఏడుగురు విద్యార్థులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. పిల్లలంతా తమకు నచ్చినంతసేపు రాత్రి చదువుకుంటారు. అనంతరం నిద్రపోతారు. ప్రవీణ్‌నాయక్ వాష్ రూమ్‌కు వెళ్తానని చెప్పి పోర్టుకో కిటికీలో నుంచి దూకేశాడు. తీవ్రగాయాలతో ఉన్న విద్యార్థికి సహచరులు సపర్యలు చేస్తుంటే తనను బతికించాలని కోరాడు. ఆస్పత్రిలో సైతం బతికించండి సార్ అంటూ వేడుకున్నాడు. కానీ, అప్పటికే తీవ్రంగా రక్తస్రావం కావడంతో చనిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్‌ఐ సందీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సైతం పరిశీలించింది. విద్యార్థి మృతికి మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఇదే క్యాంపస్‌లో విజయనగరం నెల్లిమర్లకు చెందిన ఒక విద్యార్థిని రెండేళ్ల క్రితం మృతి చెందింది. ప్రస్తుత సంఘటన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందగా, సిబ్బంది కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విద్యార్థి మృతిపై కేర్‌టేక్ శాంతారావు ఫిర్యాదు చేశారు.
ప్రేమ వ్యవహారమే కారణం : డీఎస్పీ
ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రవీణ్‌నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ సీహెచ్ వివేకానంద స్పష్టం చేశారు. గూనపాలెంలోని పోలీస్ సబ్‌డివిజనల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రవీణ్‌నాయక్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. ప్రేమించే సమయం ఇది కాదని, చదువుకుందామని ఆమె చెప్పడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ప్రవీణ్ ఉండే రూమ్‌లో ఓ అబ్బాయి బయటకువెళ్లి రాకపోవడంతో తలుపులు తీసి ఉంచారని, అప్పటికే మిగతావారితో కలిసి పడుకుని ఉన్న ప్రవీణ్ రాత్రి 1:30 సమయంలో లేచి తలుపు తోసుకుని బయటకు వెళ్లినట్లు విద్యార్థులు చెప్పారన్నారు. కొద్ది క్షణాల్లోనే మూడో అంతస్తు కిటికీ నుంచి ప్రవీణ్‌నాయక్ దూకేశాడని తెలిపారు. విద్యార్థులు, కేర్ టేకర్లు కలిసి విద్యార్థిని రిమ్స్‌కు తీసుకెళ్లారని, బ్లీడింగ్ ఎక్కువగా కావడంతో 2.30కు ప్రాణాలు విడిచాడని వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మృతుడిది పుల్లలచెరువు
మండలం పీఆర్‌సీ తండా
Comments
Please login to add a commentAdd a comment