యర్రగొండపాలెం: శ్రీకాకుళం జిల్లా వెచ్చర్ల నియోజకవర్గంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలం పీఆర్సీ తండాకు చెందిన రమావత్ ప్రవీణ్‌నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. గిరిజన ఆశాకిరణమైన ఆ విద్యార్థి మరణంతో బడుగుల అభివృద్ధికి తీరని నష్టం వాటిల్లినట్లేనని అన్నారు. ఎన్నో ఆశలతో ఆ బిడ్డను కష్టపడి చదివిస్తూ తమ ఉత్తమ భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి సంఘటన జరగడంతో ఆ కుటుంబం కోలుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. వారికి న్యాయం జరగాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని, విద్యాశాఖామంత్రి లోకేష్ తన శాఖకు న్యాయం చేయకుండా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలలో, ఇతర శాఖలపై దృష్టిపెడుతున్నారని విమర్శించారు. విద్యావ్యవస్థలో బయట పడుతున్న అనేక అంశాలే అందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుపై చీకటి పొరలు కమ్ముకున్నట్లుగా అనిపిస్తోందన్నారు. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన ఆ బిడ్డ శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో తన మేధస్సుతో సీటు సాధించాడని, తమ కుటుంబానికి, తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటాడని ఆశించిన ప్రవీణ్‌నాయక్ తల్లిదండ్రులకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. విద్యావ్యవస్థలో భద్రత లోపించడం వలనే ఈ సంఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఈ ఘటనకు కారకులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని, ఆ విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
ఆ దుర్ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి
ప్రభుత్వం బాధ్యత వహించాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment