రేపు కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
ఒంగోలు: కబడ్డీ జూనియర్ విభాగం బాలబాలికల జిల్లా జట్లను ఈ నెల 15వ తేదీ ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు 70 కేజీలలోపు, బాలికలు 65 కేజీలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. వీరంతా తప్పనిసరిగా 2005 తర్వాత జన్మించి ఉండాలన్నారు. బాలురకు బాపట్ల జిల్లా చినగంజాంలోని ఎంఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో, బాలికలకు పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాట్‌పై ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఎంపికై న జట్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగే 50వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు బాలురు ఎం.గిరిబాబు (9700600996)ను, బాలికలు పి.హజరత్తయ్య (9848606573)ను సంప్రదించాలని సూచించారు.
రేపు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు
పెద్దారవీడు: మండలంలో దేవరాజుగట్టు గ్రామంలో సమర్థ సద్గురు కాశినాయనస్వామి 29వ ఆరాధన మహోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి పెద్దసైజు బండలాగు ఎడ్ల పందెం ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. ప్రథమ బహుమతి రూ.60,116, ద్వితీయ బహుమతి రూ.50,116, తృతీయ బహుమతి రూ.40,116, నాలుగోబహుమతి రూ.30,116, ఐదో బహుమతి రూ.20,116, ఆరో బహుమతి రూ.10,116 అందజేస్తున్నట్లు దాతలు ప్రకటించారు. పేర్ల నమోదుకు ఎడ్ల యజమానులు గుంటక పాపిరెడ్డి 9642186379, గొట్టం సూర్యనారాయణరెడ్డి 9989738984ని సంప్రదించాలని సూచించారు.
మంత్రిగారొస్తున్నారు.. మొదలెట్టండి!
బేస్తవారిపేట: మండలంలోని కోనపల్లె ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి వస్తున్నారని హడావుడిగా ప్రారంభించారు. మంత్రి బేస్తవారిపేట మీదుగా వెళ్తున్నారని తెలియడంతో మెప్పు పొందేందుకు ఆగమేఘాలపై పనులు చేపట్టడం గమనార్హం. జిల్లాలో రూ.21 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.
రేపటి నుంచి
ఏఎస్‌ఈఆర్ సర్వే
ఒంగోలు సిటీ: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్టు(ఏ.ఎస్.ఈ.ఆర్) సర్వేను మైనంపాడు డైట్‌లోని ట్రైనీ టీచర్స్ ఈ నెల 15, 16, 17వ తేదీల్లో నిర్వహించనున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంపిక చేసిన 30 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున పాల్గొంటారని, ఒక పాఠశాల, 20 ఇళ్లను సర్వే చేస్తారని వివరించారు. సర్వే చేస్తున్న ట్రైనీ టీచర్లకు గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా జిల్లా, రాష్ట్ర స్ధాయిలో 3 నుంచి 16 ఏళ్ల పిల్లల పాఠశాల సమోదు స్థితి, ప్రాథమిక పఠనం, గణిత పరిజ్ఞానం స్థాయిని తెలుసుకోనున్నారు.
ఎరువుల దుకాణంపై 6ఏ కేసు
పొదిలి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలను శుక్రవారం ఒంగోలు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. శ్రీసాయి కృష్ణ ట్రేడర్స్ గోడౌన్‌లో ఉన్న నిల్వలకు, రికార్డులకు రూ.2,21,000 విలువైన 5 టన్నుల ఎరువుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. స్టాక్ బోర్డు అప్‌డేట్ చేయనందున, ధరల పట్టిక చూపనందున సదరు దుకాణ యజమానిపై కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అలాగే శ్రీహరిత సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణంలో పురుగు మందుల నిల్వలకు సంబంధించి సరైన పత్రాలు లేనందున వాటి విక్రయాలను నిలుపుదల చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ వీఎస్ పాల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.చిరంజీవి, సబ్ ఇన్‌స్పెక్టర్ జి.నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి షేక్.జైనులాబ్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment