సూపర్ సిక్స్ హామీలు గాలికొదిలేశారు
చీమకుర్తి: సూపర్ సిక్స్ అమలు గాలికొదిలేశారని, మెగా డీఎస్సీపై తొలి సంతకం తప్ప ఫైలు ముందుకు కదిలింది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రకృతి వనరులను అదానీకి కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం 14వ జిల్లా మహాసభలను శుక్రవారం చీమకుర్తిలో ప్రారంభించగా, శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అదానీ అవినీతి ప్రపంచాన్ని కుదిపేస్తోందని, భారత ప్రతిష్టను అమెరికాలో తాకట్టుపెట్టారని ఎండగట్టారు. పోర్టులు, వేలాది ఎకరాల భూములు అదానీ పరమయ్యాయన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు యువగళంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తే వాటిని పగలగొట్టమని రైతులకు సలహా ఇచ్చిన నారా లోకేష్.. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పడం అతని ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం అంటూ చేస్తున్న నినాదం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడమేనని టీడీపీ పాలనపై శ్రీనివాసరావు మండిపడ్డారు. తొలుత ఎన్‌ఎస్‌పీ కాలనీ నుంచి సీపీఎం శ్రేణులు ర్యాలీగా బూచేపల్లి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. మధ్యలో రోడ్లపై మహిళలతో నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. సీపీఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు వై.వెంకటేశ్వరరావు, కారుసాల సుబ్బరావమ్మ, కే ఉమామహేశ్వరరావు, పూనాటి అంజనేయులు, మాబు, కొండారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరావు, పమిడి వెంకట్రావు, కాలం సుబ్బారావు, ఏ మాల్యాద్రి, జాలా అంజయ్య, పూసపాటి వెంకట్రావు, వై.సిద్దయ్య, పల్లాపల్లి ఆంజనేయులు, స్థానికులు పాల్గొన్నారు.
కార్పొరేట్ల మేలు కోసమే జమిలి ఎన్నికలు
యువగళంలో స్మార్ట్‌మీటర్లు పగలగొట్టమన్న లోకేష్.. అధికారంలోకి వచ్చాక వాటినే బిగిస్తున్నారు
సీపీఎం జిల్లా మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment