కుట్టు లేకుండా పాంక్రియాటిక్ ఆపరేషన్
ఒంగోలు టౌన్: నగరంలోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఒక రోగి ప్రాణాలు కాపాడారు. వల్లూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల యువకుడు గత కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. వారం రోజుల క్రితం నగరంలోని ఎన్జీఓ కాలనీలో గల అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ మందలపు నరేంద్ర బాబు దగ్గరకు చికిత్స కోసం వచ్చారు. వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన ఆయన రోగి పాంక్రియాసిస్‌లో చీము పట్టినట్లు గుర్తించారు. సహజంగా అయితే దీనికి ఆపరేషన్ చేస్తే చాలా కుట్లు పడతాయి. కానీ దానికి భిన్నంగా అధునాతన పద్ధతిలో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్‌ను ఉపయోగించి స్టెంట్ వేసి చీము మొత్తం తీసేశారు. ఈ వైద్య ప్రక్రియ తర్వాత కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో రోగి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. మూడు రోజులకే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ వైద్య చికిత్సలో ఎలాంటి కుట్టు కాని, కోత కానీ లేకపోవడం వలన రోగికి రక్త స్రావం లాంటి సమస్యలు ఉండవని ఆసుపత్రి నిర్వాహకులు డా.నరేంద్ర బాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ తరహా వైద్య చికిత్స జిల్లాలో ఇదే తొలిసారని, బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డా.వెంకటేష్, డా.బ్రహ్మేశ్వరరావు, డా.భానుతేజ, సిబ్బంది పాల్గొన్నారు.
అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల ఘనత
Comments
Please login to add a commentAdd a comment