ఎందాకైనా..
రైతు కోసం
చంద్రబాబు సర్కార్ మోసాలపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పరిపాలన చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన అన్నదాతకు అండగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేడ్కర్ భవన్ నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్వో చినఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు కలిసి అన్నదాతల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కలెక్టర్ అందుబాటులో లేకుండా పోయారన్నారు. కనీసం జాయింట్ కలెక్టర్ కూడా కార్యాలయంలో లేకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని ఆరోపించారు. జిల్లాలోని రైతులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్వయంగా కలెక్టర్ కార్యాలయానికి వస్తే అధికారులెవరూ ఉండకపోవడం సిగ్గుచేటంటూ చెవిరెడ్డి మండిపడ్డారు. మేమేమీ ధర్నాలు చేయడానికి రాలేదని, ఆందోళన చేయడానికి రాలేదని, కేవలం అన్నదాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, తద్వారా వారికి న్యాయం చేయాలని అడిగేందుకు మాత్రమే వచ్చామన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఐదేళ్లు రైతు రాజ్యం నడిచిందని, జగనన్న హయాంలో ఐదేళ్లు రైతే రాజులా రాష్ట్రాన్ని పరిపాలించారని గుర్తుచేశారు. రాష్ట్రానికి రైతే వెన్నెముక అని భావించిన జగనన్న.. ఎరువులు, విత్తనాలను 90 శాతం సబ్సిడీతో అందించారన్నారు. రైతు భరోసా ద్వారా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఆదుకున్నారని తెలిపారు. రైతు ఆత్మాభిమానంతో బతికేలా జగనన్న పాలన కొనసాగిందన్నారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు రైతుల వెవెన్నెముక విరిచేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం, రూ.30 వేలు ఇస్తామంటూ చంద్రబాబు తప్పుడు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం ఒక్క రూపాయి కూడా రైతులకు సహాయం చేయకుండా దగా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రైతులు మా జీవితాలను నాశనం చేయొద్దని చంద్రబాబును వేడుకుంటున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్ సీపీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం : మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని, రైతు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో కూటమి పాలకులు చెప్పాలని నిలదీశారు. జగనన్న పాలనలో రైతులకు పంటల బీమా పథకానికి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులే ఆ భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే క్షణాల్లో మీ ఎదురుగా వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు వాట్సాప్‌లో హలో అని పెట్టినా పలకరించే దిక్కే లేదని ఎద్దేవా చేశారు. కూటమిపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయని విమర్శించారు. ఖరీఫ్, రబీ సీజన్లు వెళ్లిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని విమర్శించారు. జగనన్న పాలనలో రైతులకు ఎడాదికి రూ.13,500 ఇస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. 2014లో రుణమాఫీ చేస్తామని హాహీ ఇచ్చి ఎగ్గొట్టినట్లే.. ఇప్పుడు కూడా మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అన్నదాతల ఆవేదనను చెప్పుకునేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కలెక్టర్ కార్యాలయానికి వస్తే ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇలాగే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఇలాగైతే ఇళ్లను ముట్టడిస్తాం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు
రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు వస్తే అధికారులంతా కలెక్టరేట్ వదిలి పారిపోయారని, ఇలాగైతే మీ ఇళ్లను ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. అధికారులు అధికారపార్టీతో అంటకాగుతున్నారని, ఽప్రతిపక్షం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్, శ్రీలంక, సిరియా అధ్యక్షులు పారిపోయారని, అలాంటి దుస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని హెచ్చరించారు. చంద్రబాబు ఏనాడూ రైతులకు అనుకూలంగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణయాదవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకుమాను రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ స్వామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, ప్రకాశం జిల్లా అగ్రికల్చర్ బోర్డు మాజీ చైర్మన్ ఆళ్ల రవీంద్రరెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా ర్యాలీ
రైతు సంపదను ఆవిరి చేస్తున్నారు :
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం సున్నం పెడుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. దళారులు రైతు సంపదను ఆవిరిచేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చే రుణాలు, బీమా, రూ.20 వేలు ఆసరాను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కార్యాలయంలో కలెక్టరు అందుబాటులో లేకుండా పోవడం బాధ్యతారాహిత్యం కాక మరేమిటని ప్రశ్నించారు. జగనన్న పాలనలో గతేడాది ఇదే సమయంలో పత్తి క్వింటా ధర రూ.6,500 ఉండగా, ఇవాళ కేవలం రూ.4000 మాత్రమే ఉందన్నారు. టమోటా కిలో ఒక్క రూపాయికి కూడా కొనేనాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అదే టమోటాను చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో కిలో రూ.50కి అమ్ముతూ ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయని, దళారుల ద్వారా అన్ని రకాల పంటల ధరలు దిగివచ్చేలా కూటమి కుతంత్రాలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతులంతా వైఎస్సార్ సీపీ పక్షాన నిలబడ్డారనే కక్షతో నీటి సంఘాల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులను దగా చేస్తే భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.
రైతు సంక్షేమాన్ని అటకెక్కించారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని అటకెక్కించి వారి నోట్లో మట్టికొట్టిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. రైతుల కోసం అండగా పోరాటం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌లు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొంటామన్నారు. ఎన్నికలకు ముందు రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సెంటర్లు లేకుండా చేశారని, దళారులు, రైస్‌మిల్లర్లు కుమ్మకై ్క అన్నదాతల వెన్ను విరుస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్బీకేల పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగనన్న ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలిచ్చి అన్నదాతలను ఆదుకుంటే నేటి పాలకులు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. జగనన్న పాలనలో ధాన్యం ధర రూ.1,750 ఉండగా, ఇప్పుడు అనేక సాకులు చెప్పి అరకొరగా చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులను మళ్లీ మోసం చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment