నేడు సాగునీటి సంఘాల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు సాగునీటి సంఘాల ఎన్నిక

Published Sat, Dec 14 2024 2:10 AM | Last Updated on Sat, Dec 14 2024 2:45 AM

నేడు సాగునీటి సంఘాల ఎన్నిక

నేడు సాగునీటి సంఘాల ఎన్నిక

ఒంగోలు అర్బన్‌: జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో నేడు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నిక జరగనుంది. మేజర్‌, మీడియం, మైనర్‌ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 342 సంఘాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. ఎన్నికల్లో మొత్తం 2,12,909 మంది ఓటర్లు సంఘాలను ఎన్నుకోనున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో 342 సంఘాలకు సంబంధించి 342మంది ఎలక్షన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అధికారులతో పాటు 886మంది పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులను నియమించారు. జిల్లాలో మేజర్‌ ప్రాజెక్టులకు సంబంధించి నాగార్జున సాగర్‌, కృష్ణ వెస్ట్రన్‌ డెల్లా ప్రాజెక్టులకు సంబంధించి 88 సంఘాలు ఉండగా మీడియం ప్రాజెక్టులకు సంబంధించి కంభం ట్యాంక్‌ 5, మోపాడు రిజర్వాయర్‌ 4, పాలేరు బిట్రగుంట ఆనికట్టు 5 సంగాలు ఉండగా మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్స్‌ క్రింద 240 సంఘాలకు ఎన్నికల జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పురుష ఓటర్లు 1,51,380మంది, మహిళా ఓటర్లు 61,529మంది ఉన్నారు.

నో డ్యూ సర్టిఫికెట్లు టీడీపీ సానుభూతిపరులకే..

సాక్షి నెట్‌వర్క్‌: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో కిరికిరి చేసేందుకు అధికార కూటమి పార్టీల నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతో కుట్రలకు తెరలేపి అందులో అధికారులను పావులుగా మార్చారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కూటమి నేతలతో కొందరు అధికారులు అంటకాగుతూ వారు చెప్పిన విధంగా తలాడిస్తుండగా, వారి మాట మీరితే బదిలీల పేరుతో వేధిస్తారన్న భయంతో కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాగు నీటి సంఘాల ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్లు, నీటి పన్ను రశీదులు ఇవ్వడంలో అధికారులు వివక్ష చూపిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికార కూటమి నేతలకు అన్ని పత్రాలు ఇచ్చిన అధికారులు.. వారికి పోటీ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇతర అభ్యర్థులకు ఏ సమాచారం తెలియజేయడం లేదు.

● కొనకనమిట్ల మండలంలో వాగుమడుగు, అంబాపురం, వద్దిమడుగు, తువ్వపాడు, చినారికట్ల, పెదారికట్లకు చెందిన వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు నో డ్యూ సరిఫికెట్ల కోసం తహసీల్దార్‌ సురేష్‌ను సంప్రదించడగా డీటీని కలవాలని సూచించారు. డీటీని అడిగితే వీఆర్వోను కలవాలని, వీఆర్వోను సంపద్రిస్తే మళ్లీ తహసీల్దార్‌నే కలవాలని డబుల్‌ గేమ్‌ ఆడటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు తాము ప్రభుత్వ ఉద్యోగులమన్న సంగతి మరిచి ప్రవర్తిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ శనివారం ఆయా గ్రామ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు స్వచ్ఛంద అభ్యర్థులు తెలిపారు.

● తర్లుపాడు మండలంలో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వీఆర్వోలు సచివాలయాల్లో పరిసరాల్లోకి కూడా రాలేదు. అదే సమయంలో టీడీపీ నాయకులను మాత్రం ఓ చోటకు పిలిపించి మరీ సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ మండలంలో నిర్వహించే 3 సంఘాల ఎన్నికల్లో ఎవరు గెలుపొందాలో ఎమ్మెల్యే ముందుగానే నిర్ణయించినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది.

● ‘ఏ సంఘానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు. ఏ పనికి ఆ పని జరిగిపోతుంది’ అని మర్రిపూడి తహసీల్దార్‌ నరసింహారావు పేర్కనడం ఇక్కడ ఎన్నికలు ఎలా సాగబోతున్నాయో చెప్పకనే చెప్పినట్టయింది. ఈ మండలంలో ఎక్కడా కనీసం దండోరా వేయించలేదు. ఓటర్లకు స్లిప్పులు పంచలేదు.

342 సంఘాలు, 2,12,909 మంది ఓటర్లు అధికారానికి అధికారుల జీ హుజూర్‌ సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార పక్షం తొండాట టీడీపీ నేతలను ఏకగ్రీవం చేసే కుట్రలో పావులుగా అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement