జర్నలిస్టులపై దాడి అనాగరికం
మార్కాపురం రూరల్: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో వార్తల కవరేజీ కోసం వెళ్లిన సాక్షి రిపోర్టర్లపై దాడి చేయడం అనాగరికమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ ఖండించారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో టీవీ 9 ప్రతినిధిపై, తాజాగా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాక్షి ప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మార్కాపురంలోని ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రమణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా వ్యవస్థపై ఇటీవల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చని అన్నారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు మూలా అల్లూరెడ్డి, యూనియన్ జిల్లా కోశాధికారి డి బాబీ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాజీవలి, జిల్లా కమిటీ సభ్యుడు ఎస్‌కే అజ్మతుల్లా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎం.పవన్, వి.రాజు, మల్లికార్జున, ఎస్‌కే రఫీ, ఎస్‌కే మస్తాన్, రాజ్‌కమల్, శేఖర్, శ్రీధర్, సాయి సుబ్బారావు, యోగి, అనీల్‌కుమార్ పాల్గొన్నారు.
సాక్షి జర్నలిస్టులపై దాడిచేసిన గూండాలను అరెస్టు చేయాలి...
మార్కాపురం: వేముల తహసీల్దార్ కార్యాలయంలో నీటి సంఘాల ఎన్నికల వార్తల కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రికా రిపోర్టర్ రాజారెడ్డిపై కొందరు గూండాలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపరచడాన్ని జర్నలిస్టు అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా ప్రధాన కార్యదర్శి కాళంరాజు రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా వారి కెమెరాలు, సెల్‌ఫోన్లను లాక్కుని పగలగొట్టడాన్ని తీవ్రంగా పరిగణించి వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని రామకృష్ణ కోరారు.
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రమణ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment