పశుగ్రాస పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● పశుసంవర్థకశాఖ జేడీ బేబీరాణి
నాగులుప్పలపాడు: నూరు శాతం రాయితీపై పశుగ్రాసం అందజేస్తున్న పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జేడీ బేబీరాణి కోరారు. నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో శుక్రవారం రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పూర్తి సబ్సిడీతో పశుగ్రాసం అందజేసే ఈ పథకం పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి రైతు 10 సెంట్లు, 50 సెంట్ల వరకు పశుగ్రాసం సాగుచేసుకోవచ్చన్నారు. అందుకు సంబంధించి జాబ్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ కలిగి ఉండాలని, బోరు లేదా నీటి వసతి ఉండాలని సూచించారు. 50 సెంట్లలో సాగుచేసేవారికి రూ.32,992, 40 సెంట్లకు రూ.26,394, 30 సెంట్లకు రూ.19,795, 20 సెంట్లకు రూ.13,197, 10 సెంట్లకు రూ.6,599 ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం పశుగణన, గోకులం షెడ్లను జేడీ బేబీరాణి పరిశీలించారు. కార్యక్రమంలో అమ్మనబ్రోలు పశువైద్యశాల వైద్యాధికారిణి వెంకటసురేఖ, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
తొలిరోజు విజయపాల్ విచారణ పూర్తి
ఒంగోలు టౌన్: డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కస్టడీకి సంబంధించిన కేసులో అరెస్టయిన సీఐడీ మాజీ ఏఎస్పీ విజయపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం ఒంగోలు తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి 2 గంటలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట విచారణకు హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో సాయంత్రం 7 గంటల వరకు సుమారు 5 గంటల పాటు ఆయనను విచారించారు. ఎస్పీ దామోదర్‌తో పాటు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, సీఐలు విచారణలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గత నెల 13వ తేదీ ఆయన తొలిసారిగా విచారణకు ఒంగోలు వచ్చారు. ఆ తర్వాత రెండోసారి 26వ తేదీ విచారణకు వచ్చిన ఆయనను రాత్రి 9 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తాజాగా కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు విచారణ చేయనున్నారు. తొలిరోజు విచారణ తర్వాత ఆయనను తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment