కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి.... | - | Sakshi
Sakshi News home page

కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి....

Published Thu, Feb 27 2025 12:49 AM | Last Updated on Thu, Feb 27 2025 12:53 AM

-

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొంత కాలంగా జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం నివ్వెరపరుస్తున్నాయి. ఇటీవల జరిగిన నాలుగు హత్యల్లో నిందితులు, బాధితులు పశ్చిమ ప్రకాశానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో రెండు మద్యం ప్రభావంతో జరగగా , హైదరాబాద్‌లో జరిగిన వివాహిత మాధవి హత్య మానవులలో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇన్సూరెన్స్‌ కోసం సొంత చెల్లిల్నే అన్న హతమార్చాడం మనుషుల్లో దాగి ఉన్న మృగాన్ని బయట పడేసింది.

చెల్లెలికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసిన అన్న...

అమ్మానాన్నలకు ప్రతిరూపంగా నిలబడాల్సిన అన్నయ్యే డబ్బుల కోసం చెల్లెలిని హత్య చేశాడు. కనిగిరికి చెందిన మాలపాటి సంధ్య (24 ), మాలపాటి అశోక్‌ అన్నా చెల్లెళ్లు. సంధ్యకు వివాహమైంది. సంతానం కలగకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకొని పుట్టింట్లో ఉంటోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నష్టపోయిన ఆమె అన్నయ్య అశోక్‌ బాబు తన అప్పులను తీర్చుకునేందుకు చెల్లెలిని హత్య చేయాలని పథకం పన్నాడు. చెల్లెలు సంధ్యతో వివిధ కంపెనీల్లో కోటి రూపాయలకు బీమా చేయించాడు. సంధ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఒంగోలుకు తీసుకొచ్చి తిరిగి వెళ్లే సమయంలో ముందస్తు పథకం ప్రకారం ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చాడు. పొదిలి సమీపంలోకి రాగానే నిర్జన ప్రదేశంలో కారు ఆపి నిద్రపోతున్న చెల్లెలిని హత్య చేశాడు. ఆ తరువాత కారును చెట్టును ఢీకొట్టించి ప్రమాదం జరిగినట్లు సృష్టించాడు. ఆ తరువాత పోస్టు మార్టంలో నిజాలు బయటపడకుండా ఉండేందుకు ఒక మిత్రుడి ద్వారా ప్రభుత్వ వైద్యుడికి రూ.3.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇదంతా కేవలం డబ్బుల కోసమే. అన్నా అని పిలిచిన చెల్లిలి మొఖం మీద దిండు వేసి గాలి ఆడకుండా చేసి చంపేయడం తలచుకుంటేనే ఒళ్లుగగుర్పాటు కలుగుతుంది. అయితే ఈ హత్యలో అధికార టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు నిందితుడి తల్లి ఆరోపించడం గమనార్హం.

మద్యం మత్తులో తండ్రిని రంపంతో ముక్కలు చేసి..

జిల్లాలోని దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామానికి చెందిన పైడిపోగు ఏసు (79) రైల్వేలో గ్యాంగ్‌మన్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆయనకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య పదేళ్ల క్రితం చనిపోవడంతో గ్రామంలోని చిన్న కుమారుడైన మరియదాసు వద్ద ఉంటున్నారు. మరియదాసు బాధ్యత లేకుండా రోజూ మద్యం తాగి వస్తుండడంతో గొడవపెట్టుకున్న భార్య శాంతకుమారి ఇద్దరు కుమార్తెలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో మద్యం తాగడం మరింత ఎక్కువ చేశాడు. డబ్బుల కోసం తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9వ తేదీన రాత్రి మద్యంతాగి వచ్చిన మరియదాసు తెల్లవారుజామున చుట్టుపక్కల ఇళ్లలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తండ్రిని హతమార్చాడు. చెట్టును కోసే రంపంతో తండ్రి తల, మొండెంను కోసి వేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కన్న కొడుకే తండ్రిని రంపంతో కోసి చంపేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎంత తాగినా కన్నతండ్రిని ఇంత దారుణంగా ఎలా చంపగలిగాడన్నది ఎవరికీ అర్థం కాకుండా పోయింది.

భార్యను చంపి కుక్కర్లో ఉడికించి..

రాచర్లకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ జవాను గురుమూర్తి ప్రస్తుతం హైదరాబాద్‌ కంచన్‌ బాగ్‌ డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో భార్య వెంకట మాధవి (35)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తరుచూ భార్యతో గొడవపడే గురుమూర్తి గత నెల చివరలో పదునైన ఆయుధంతో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ప్లాన్‌ చేశాడు. యూ ట్యూబ్‌లో శోధించిన అతడు మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఒక పెద్ద ప్రెషర్‌ కుక్కర్‌ తీసుకొచ్చి అందులో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తరువాత వాటిని ఎండబెట్టి కాల్చాడు. కాల్చిన భాగాలను మూడు రోజుల పాటు రోకలిబండతో పొడికొట్టాడు. ఆ పొడిని డ్రైనేజిలో పడేసి మిగిలిన ఎముకలను జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఇదంతా ఇంట్లో కూర్చోని తీరిగ్గా చేయడం గమనార్హం. భార్యను చంపడానికి ప్లాన్‌ చేసుకోవడానికి ముందు వీధి కుక్కపై ప్రయోగం చేసినట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. బంధువులు, స్నేహితులు, కాలనీలో నివసించే ప్రజలు నివ్వెరపోయారు. ఇలాంటి మానవ మృగంతో కలిసి జీవించామా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ హత్య గురించి సమాచారం తెలుసుకున్న గురుమూర్తి సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఉలిక్కిపడ్డారు. మరీ ఇంత క్రూరంగా భార్యను ఎలా హత్య చేయగలిగాడో అని చర్చించుకుంటున్నారు.

విచ్చలవిడి మద్యం విక్రయాలతో పెరుగుతున్న నేరాలు

మాదక ద్రవ్యాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రభావానికి లోనైన యువత ఎంతటి నేరాలకై నా వెనుకాడడం లేదు. తామేం చేస్తున్నామో తెలియనంతగా మత్తులో క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. లేకపోతే కన్నతల్లిని లైంగికంగా వేధించడం, కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఉడికించడం లాంటి ఘటనలు ఊహించలేం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. దీని విషయంలో మహిళా సంఘాలు ముందుగానే హెచ్చరించినా సొంతపార్టీ నాయకుల బొజ్జలు నింపుకునేందుకు సంపద సృష్టించాలన్న ఊపులో ఉన్న రాష్ట్ర పాలకులకు ఇవేమీ పట్టలేదు.

దొనకొండలో తండ్రిని కుమారుడు హత్య చేసిన నాలుగు రోజుల్లోనే కంభంలో కన్న కొడుకును తల్లి హత్య చేయించడం కలకలం సృష్టించింది. గ్రామంలోని జయప్రకాశ్‌ వీధిలో నివశిస్తున్న కదం లక్ష్మి దేవికి నలుగురు కుమారులు. రెండో కుమారుడు భార్యా బిడ్డలతో కలిసి కడప జిల్లా రాయచోటిలో నివాసముంటున్నాడు. మిగిలిన ముగ్గురు కుమారులతో కలిసి లక్ష్మిదేవి కంభంలో ఉంటోంది. పోలియో బాధితుడైన మూడో కుమారుడు శ్యాం (35) కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడ్డాడు. తప్పతాగిన మత్తులో వావి వరసలు లేకుండా కుటుంబ సభ్యులను లైంగికంగా వేధించసాగాడు. తల్లి, పిన్ని, చెల్లి వరసయ్యే అమ్మాయిలను వేధిస్తుండడంతో విసిగి పోయిన ఆమె తన ఇద్దరు కుమారులు, మరొక ఆటో డ్రైవర్‌తో కలిసి శ్యాంను హత్య చేసింది. అయితే అతడి మృతదేహాన్ని ఏమి చేయాలో పాలుపోని లక్ష్మీదేవి చివరకు 8 ముక్కలుగా నరికి మూడు గోతాల్లో కుక్కి ఇంటికి కొంతదూరంలో పంటకాలువ గట్టు మీద ఒకచోట రెండు గోతాలు, మరో చోట ఒక గోతాన్ని పడేసింది. రెండు రోజుల తరువాత ఆ గోతాల నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ఈ హత్య పెను సంచలనం సృష్టించింది. కన్న తల్లి, సోదరులు కలిసి హత్య చేయడం ఒక ఎత్తయితే అతడి మృతదేహాన్ని 8 ముక్కలుగా నరకడం, గోతాల్లో కుక్కి రోడ్డు పక్కన పడేయడం దారుణమని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి.... 1
1/2

కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి....

కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి.... 2
2/2

కన్న కొడుకును ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement