నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు

Published Thu, Feb 27 2025 12:49 AM | Last Updated on Thu, Feb 27 2025 12:53 AM

నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు

నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు

కొనకనమిట్ల: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అంబాపురంలోని అంబబాల సంగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో పాలపండ్ల విభాగం నుంచి ఆరుపండ్ల సైజు వరకు (12 క్వింటాళ్ల బండ) ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 10 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొంటున్నాయని, గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు బహుమతులు వరుసగా రూ.30, రూ.20, రూ.10 వేలు దాతల సహకారంలో ఇస్తున్నట్లు చెప్పారు. శివాలయం వద్ద భక్తులకు అన్నదానం, రాత్రికి విద్యుత్‌ ప్రభ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎడ్ల పందేలకు వచ్చే వారు వివరాలకు 8790612406, 9704364204 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

బండలాగుడు పోటీల్లో రాచర్ల ఎడ్ల సత్తా

కంభం: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని మండలంలోని చిన్నకంభం వీరభద్రస్వామి ఆలయం వద్ద పిదప శరభారెడ్డి, జనార్థన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీల్లో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బచ్చిగారి విజయలక్ష్మి నాయుడు ఎడ్లు 3149.4 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచి సత్తాచాటాయి. నంద్యాల జిల్లా గడివేములకు చెందిన పేరుమాళ్ల సంజయ్‌ కుమార్‌ ఎడ్లు 3110.6 అడుగులు లాగి ద్వితీయ స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మి ఎడ్లు 2700.11 అడుగులు లాగి మూడో స్థానం, బేస్తవారిపేట బసినేపల్లికి చెందిన వెనిగండ్ల వెంకట చైతన్యకుమార్‌ ఎడ్లు 2495.8 అడుగులు లాగి నాల్గవ స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన కాలమూరి రంగారెడ్డి ఎడ్లు 2221.1 అడుగులు లాగి ఐదో స్థానం, మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన మట్టం జజ్సిరయ్య ఎడ్లు 1933.1 అడుగులు లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతుల కింద రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు అందజేశారు.

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఒంగోలు సిటీ: ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్‌ త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్‌.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కొమరోలు మండలం ఏబీఎం ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డి.ఆంజనేయులుని మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అలాగే చెరుకూరు ఆంధ్రకేసరి మెమోరియల్‌ రెసిడెన్సీ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 13 నెలల జీతాలు సమస్య ఉందని తెలిపారు. కోర్టుకు వెళ్లిన 13 ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిలీవింగ్‌, జాయినింగ్‌ సమస్యలు ఉన్నాయని తెలిపారు.

రెండు ఫేజ్‌ల్లోపొగాకు కొనుగోళ్లు

చీమకుర్తి: జిల్లాలో ఉన్న 11 వేలం కేంద్రాల్లోని ప్లాట్‌ఫాంలలో రెండు ఫేజ్‌లలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. టుబాకో బోర్డు ఆర్‌ఎం లక్ష్మణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం గుంటూరులో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో పొగాకు కొనుగోళ్లకు సంబంధించి తేదీలను ఖరారు చేశారు. ఫేజ్‌–1లో ఒంగోలు–1, కొండపి, పొదిలి, కందుకూరు–1 ప్లాట్‌ఫాంలలో వచ్చేనెల 10న కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఫేజ్‌–2లో ఒంగోలు–2, టంగుటూరు, వెల్లంపల్లి, కందుకూరు–2, కనిగిరి, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వచ్చేనెల 19న కొనుగోళ్లు ప్రారంభిస్తారు. జిల్లా బోర్డు పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు జిల్లా పరిధిలో 2 వేలం కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే.

103 మిలియన్‌ కేజీల కొనుగోలుకు అనుమతి:

పొగాకు రైతుల నుంచి ఈ ఏడాది 103 మిలియన్‌ కేజీలు కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతిచ్చింది. గత ఏడాది 88 మిలియన్‌ కేజీలకు అనుమతినివ్వగా ఏకంగా 153 మిలియన్‌ కేజీలు కొనుగోలు చేశారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అధికారకంగా 103 మిలియన్‌లకు పెంచినా చివరకు రైతులు సాగు చేసిన విస్తీర్ణం కూడా భారీగా పెరగటంతో బోర్డు అనుమతించిన దానికి మించి కొనుగోళ్లు జరగొచ్చని రైతులు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి 68,500 హెక్టార్లలో సాగు చేయాలని బోర్డు అనుమతిస్తే దాని పరిధికి మించి 88 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు బోర్డు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. దానిని బట్టి గత ఏడాది కొనుగోలు చేసిన 153 మిలియన్‌ కేజీలకు మించి కొనుగోళ్లు జరగొచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకలో పొగాకు కేజీ గరిష్ట ధర దాదాపు రూ.350కు పైగా పలుకుతుండటంతో ఈ ఏడాది మన రాష్ట్రంలోని పొగాకు కి కూడా అదే ధరలు వస్తాయని ధీమాగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement