● మద్దిపాడు ప్రాంతంలోనే ఏకంగా 7 లారీల నుంచి డీజీల్ తస్కరించిన కిలాడీలు
ఒంగోలు టౌన్: జిల్లాలో డీజిల్ దొంగలు రెచ్చి పోయారు. కేవలం ఒక్క రోజు వేయి లీటర్ల డీజిల్ ఎత్తుకెళ్లారు. లారీ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మద్దిపాడు మండలంలో మంగళవారం రాత్రి నిలిపి ఉంచిన 7 లారీల ఆయిల్ ట్యాంకర్లను పగుల గొట్టిన దొంగలు అందులోంచి వేయి లీటర్ల డీజిల్ దొంగలించారు. యూనియన్ కార్యాలయం వద్ద 4 లారీలు, గుళ్లాపల్లిలో 2 లారీలు, ఒంగోలు ఆటోనగర్‌లో ఒక లారీ నుంచి డీజిల్ తస్కరించారు. ఉప్పుగుండూరు ముఠా, సింగరాయకొండ– ఉలవపాడు ముఠాలకు చెందిన కొందరు అర్ధరాత్రి ఆటోల్లో వచ్చి ఆపి ఉంచిన లారీల ట్యాంకర్లను పగుల గొట్టి సుమారు వేయి లీటర్ల డీజిల్ తీసుకెళ్లినట్లు సమాచారం. 20 లీటర్ల మంచినీటి బబుళ్లను తీసుకొచ్చి అందులో డీజిల్ నింపుకొని పోయారు. పోతూ పోతే ఒక బబుల్‌ను విడిచిపెట్టి పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి మద్దిపాడు పోలీసుకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ వచ్చి విచారించి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఈమధ్య టంగుటూరు, ఏడుగుండ్లపాడు మధ్యలో రెండు లారీల నుంచి డీజిల్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ డీజిల్ దొంగతనాల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ హైవేలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని వెనక్కి పంపించి కొత్త సిబ్బందిని నియమించారు. ఇది జరిగిన వారం రోజులలోనే ఒకే రోజు రాత్రి ఏకంగా 7 లారీల నుంచి డీజిల్ తీసుకెళ్లడంతో లారీ యజమానులు లబోదిబో అంటున్నారు. హైవేల పక్కన ఉన్న ధాబాలు, టీ స్టాళ్లు, భోజన హోటళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హైవే మీద జరుగుతున్న డీజిల్ దొంగతనాలను అరికట్టే విషయంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విభిన్న ప్రతిభావంతుల ఏడీపై విచారణకు ఆదేశం
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా విభిన్న ప్రతిభావంతుల ఏడీపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని విభిన్న ప్రతిభావంతుల, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర డైరక్టర్ నుంచి ఆదేశాలొచ్చాయి. ఆ మేరకు కలెక్టర్‌కు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలులోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేవని, కనీసం 20 మంది విద్యార్థులు లేకున్నా, 50 మంది ఉన్నట్లు హాజరు నమోదు చేస్తున్నారని, హెల్పర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండటంలేదని జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన సమితి అధ్యక్షురాలు ఎం సులోచనా రాణి ఫిర్యాదు చేశారు. సిబ్బందిలో ఎక్కువ మంది ఏడీ, సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో పనులు చేస్తున్నారని, తదితర అంశాలపై రాష్ట్ర డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment