
పలుకు బడి!
జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అవినీతి చీడ పట్టుకుంది. ఇక్కడ ఫైళ్లు కదలాలంటే చేతులు తడపాల్సిందే. డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ ఉద్యోగి వైఖరి ఆ కార్యాలయానికి మాయని మచ్చగా మారింది. వివిధ పనుల నిమిత్తం నిత్యం వచ్చే ఉపాధ్యాయులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు అతని తీరుపై విసుగు చెందారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కార్యాలయంలో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
చిన్నసారు
పోక్సో కేసు ఉపాధ్యాయుడికి పోస్టింగ్..
ఫోర్త్ కేటగిరీ కింద
పోస్టింగ్
పోక్సో కేసులో అరెస్టయి రిమాండ్ అనంతరం సదరు ఉపాధ్యాయునికి ఫోర్త్ కేటగిరీ కిందే పోస్టింగ్ ఇచ్చాం. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఏ కిరణ్‌కుమార్, డీఈఓ, ఒంగోలు
ఒంగోలు సిటీ: ఆ ఉద్యోగి క్యాడర్ చిన్నది కానీ ఆయన చేసే పనులు మాత్రం జిల్లా స్థాయి అధికారుల పనులు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ఆ చిన్న ఉద్యోగిని సంప్రదించాల్సిందే. చిన్న స్థాయి బిల్లుల దగ్గర నుంచి పై స్థాయి అనుమతుల వరకు ఫైల్ కదలాలంటే ఆయన చేతులు తడపాల్సిందేనంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల రెన్యువల్స్, ఎయిడెడ్ పాఠశాలల విషయాల్లో కూడా భారీగా దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని సైతం వేధిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన మాట వినకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏలతో ఫోన్ చేయించి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏ ఫైలు కదలాలన్నా ...
జిల్లా విద్యాశాఖలో ఆయన చిన్న ఉద్యోగి. అయితే అంతా తానై వ్యవహరించడం గమనార్హం. ఏ చిన్నపాటి ఫైలు కదలాలన్నా ఆయన్ను దాటుకొని వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, రెన్యువల్, కొత్త పాఠశాలలకు పర్మిషన్‌కు సంబంధించి అంశాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సదరు ఉద్యోగి భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. ఏదైనా పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన కొందరు ఉపాధ్యాయులకు ముందుగానే పని అయ్యేందుకు ఇంత ఖర్చవుతుందని చెప్తుండడం..అతని అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్యాలయంలో సిబ్బందిని సైతం తాను చెప్పిన పని చేయకపోతే వేధింపులకు గురి చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో, వారి పీఏలతో సైతం ఫోన్లు చేయించి ఒత్తిడి చేయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముడుపులు ఇవ్వని వారిపై ఎమ్మెల్యేలకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారం. సదరు ఉద్యోగి నిర్వాకాలపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు డీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. విచారణకు ఆదేశించారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
డిప్యుటేషన్ మీద వచ్చి పెత్తనం..
నగరంలోని ఓ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. రాజకీయ నాయకుల సిఫార్సుతో డీఈఓ కార్యాలయానికి డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సదరు ఉద్యోగి ఓ డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో పనిచేశాడు. ఆ సమయంలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీసుల విషయంలో భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు స్కూళ్ల వద్ద కూడా ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతని వివరాలు సేకరించిన అధికారులు డిప్యుటేషన్‌పై తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయినా పలుకుబడిని ఉపయోగించి డీఈఓ కార్యాలయంలో చేరాడు. ప్రస్తుతం ఆయనదే ఇక్కడ పెత్తనం. ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి పనైనా క్షణాల్లో అయిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
డీఈఓ కార్యాలయంలో అక్రమార్కుడి తిష్ట క్యాడర్ చిన్నదైనా..పెత్తనమంతా ఆయనదే ఫైలు కదలాలంటే..పైసలు రాల్చాల్సిందే.. అధికార పార్టీ ఎమ్మెల్యేల పేరు చెప్పి బెదిరింపు కార్యాలయ సిబ్బందికి తలనొప్పిగా మారిన వైనం పోక్సో కేసు ఉపాధ్యాయుడికి పోస్టింగ్‌పై సర్వత్రా విమర్శలు
కారుమంచి జెడ్పీ హైస్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించాడన్న కేసులో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన సదరు ఉపాధ్యాయుడిని ఉపాధ్యాయ సంఘ నాయకులు డీఈఓ, అధికార పార్టీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. సదరు ఉపాధ్యాయుడికి జిల్లా కేంద్రానికి సమీపంలో పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదైన సదరు ఉపాధ్యాయుడికి నెలలు తిరక్కుండానే పోస్టింగ్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోనూ ఈ ఉద్యోగి కీలకంగా వ్యవహరించాడని ప్రచారం జరుగుతోంది.