టీబీపై అవగాహన ఉండాలి
● డీఎంహెచ్‌వో వసంతరావు
ఇల్లంతకుంట(మానకొండూర్): టీబీ నుంచి విముక్తి పొందిన చాంపియన్లు ఆ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు కోరారు. ఇల్లంతకుంట మండల పరిషత్‌లో గురువారం టీబీ చాంపియన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ఇంపాక్ట్ ఇండియా సంస్థ టీబీ అలర్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తుందని తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రతి ఆరోగ్య సబ్‌సెంటర్ నుంచి ఇద్దరు చొప్పున 16 మంది టీబీ చాంపియన్లు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఇండియా ప్రోగ్రాం జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్, ఇల్లంతకుంట పీహెచ్‌సీ డాక్టర్ శరణ్య, వైద్యాధికారి వెంకటరమణ, సూపర్‌వైజర్ జవహర్, శాంత పాల్గొన్నారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే రేపటితరం పౌరుల భవిష్యత్ బాగుంటుందని జిల్లా వైద్యాధికారి వసంతరావు పేర్కొన్నారు. ఇల్లంతకుంట హైస్కూల్‌లో గురువారం రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో పాల్గొన్నారు. హెచ్‌ఎం ప్రేమలత, మెడికల్ ఆఫీసర్ గౌస్‌భాష, ప్రమోద, టీచర్లు పాల్గొన్నారు.
నమ్మించి వంచించిన కాంగ్రెస్
● తాజామాజీ సర్పంచుల జేఏసీ కన్వీనర్ కరుణాకర్
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ మరోసారి నమ్మించి వంచించిందని తాజామాజీ సర్పంచుల జేఏసీ కన్వీనర్ అక్కెనపల్లి కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు గ్రామాల్లో తమ డబ్బులు పెట్టుకుని అభివృద్ధి చేస్తే ఏళ్లుగా బిల్లులు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వేడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. సీఎం వేములవాడకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలే సమ్మతించి పాస్‌లు కూడా ఇప్పించారన్నారు. కానీ సీఎం రావడానికి ఒక రోజు ముందే తమను బందిపోట్లు, టెర్రరిస్టుల్లా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, గౌరవ అధ్యక్షుడు చాకలి రమేశ్, బొజ్జం మల్లేశం, మంతెన సంతోష్, చిట్నేని శ్రీనివాస్‌రావు, గున్నాల లక్ష్మణ్, రాజూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు.
‘సీఎం గిరి వికాసం’ వినియోగించుకోవాలి
కోనరావుపేట(వేములవాడ): గిరిజన పోడు రైతులు సీఎం గిరి వికాసం పథకాన్ని వినియోగించుకోవాలని లంబాడీల ఐక్య వేదిక(లైవ్) రాష్ట్ర ఇన్‌చార్జి బానోత్ నరేశ్‌నాయక్ కోరారు. కోనరావుపేట మండలం కమ్మరిపేటతండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ రాష్ట్ర ఇన్‌చార్జి బానోత్ నరేశ్‌నాయక్ మాట్లాడారు. ఈ పథకం కింద భూమి చదును చేయడం, బోరు మోటార్, పంపుసెట్, విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దేసాయినాయక్, తిరుపతినాయక్, రాజునాయక్, లక్ష్మీబాయి పాల్గొన్నారు.
ముస్లిం, మైనార్టీలకు గ్రూప్–2 మాక్ టెస్ట్‌లు
సిరిసిల్ల: జిల్లాలోని ముస్లిం, మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్–2 మాక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆర్వీ రాధాబాయి గురువారం తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 29లోగా ఆఫీస్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఫస్ట్ మాక్‌టెస్ట్ డిసెంబరు 2, 3వ తేదీల్లో, సెకండ్ టెస్ట్‌ను డిసెంబరు 9, 10వ తేదీల్లో నిర్వహిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment