‘ఎగువ’కు మధ్యమా‘నీరు’! | - | Sakshi
Sakshi News home page

‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!

Published Sat, Nov 23 2024 12:03 AM | Last Updated on Sat, Nov 23 2024 12:03 AM

‘ఎగువ

‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!

● మల్కపేటకు పంపింగ్‌ ఏర్పాట్లు ● కాళేశ్వరం 9వ ప్యాకేజీపై కదలిక ● నెలాఖరులోగా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు సీఎం ఆదేశాలు ● నిధులొస్తే పనులు ముందుకు ● ఎగువ మానేరు నిండితే జిల్లా సస్యశ్యామలం ● వేములవాడలో సీఎం, మంత్రి ప్రకటనతో ఆశలు

సిరిసిల్ల: జిల్లాలోని ప్రాజెక్టుల పనుల్లో కదలిక మొదలైంది. కాళేశ్వరం ప్యాకేజీ–9 పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బుధవారం నాటి వేములవాడ పర్యటనలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలతో పనుల్లో కదలిక వచ్చింది.

మల్కపేటను నింపేందుకు ఏర్పాట్లు

సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ను నింపేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. గతేడాది రెండు పంపులను ట్రయల్‌రన్‌ చేసి ఒక్క టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్‌లో నింపారు. మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్కపేటను పూర్తి స్థాయిలో నింపేందుకు పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్లు మరమ్మతు చేస్తూ ఎలక్ట్రికల్‌ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. మల్క పేట నిండితే.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గంభీరావుపేట ఎగువమానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలించవచ్చు.

మూడు దశల్లో నర్మాలకు నీరు

మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం నీటిని సిరిసిల్ల నుంచి మల్కపేటకు 12.03 కిలోమీటర్ల సొరంగం ద్వారా తరలించి, రెండు పంపులతో సర్జిఫూల్‌ నుంచి నీటిని 130 మీటర్ల ఎత్తులో ఉన్న మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. మల్కపేట ప్రాజెక్టు నుంచి బ్యాక్‌వాటర్‌ను కాల్వ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి మీదుగా మైసమ్మ చెరువులోకి వెళ్తుంది. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ శివారులోని సింగసముద్రం చెరువులోకి నీటిని మళ్లిస్తారు. రెండో దశలో నాగంపేట తండా వద్ద 2.25 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంపులను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంది. పంపులు, మోటార్లు సిద్ధంగా ఉన్నా బిగించలేదు. సివిల్‌వర్క్‌ పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తయితే మూడో దశలో గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌ బట్టలచెరువులోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి కాల్వ ద్వారా ఎగువమానేరు(నర్మాల)కు గోదావరి జలాలు చేరుతాయి. నాగంపేటతండా వద్ద పనులు ఏడాదిగా సాగడం లేదు. దీంతో ఎగువమానేరుకు గోదావరి నీరు చేరే రెండో, మూడో దశ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లా సస్యశ్యామలం

జిల్లాలోని మెట్టభూములకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే జిల్లాలోని 2.78 లక్షల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందుతుంది. ఇందులో భాగంగానే కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి, రంగంపేట చెరువులోకి గోదావరి జలాలను తరలించేందుకు కాల్వలు, పైపులైన్‌ పనులు చేపట్టారు. ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరితే జిల్లా సస్యశ్యామలమవుతుంది. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం దరి చేరనుంది. వేములవాడ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎగువ మానేరును నింపుతామని ఏడాదిలోగా పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పెద్దల మాటలతో ప్రాజెక్టు పనులపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి.

కాళేశ్వరం 9వ ప్యాకేజీ స్వరూపం

పని ప్రారంభం : 2013

ఎక్కడి నుంచి ఎక్కడికి : సిరిసిల్ల నుంచి ఎగువ మానేరు

పొడువు : 32 కిలోమీటర్లు

సొరంగ మార్గం : 12.03 కిలోమీటర్లు (సిరిసిల్ల–మల్కపేట)

వ్యయం : రూ.1,464.42 కోట్లు

ప్రధాన జలాశయాలు : మల్కపేట, బట్టలచెరువు

కొత్త ఆయకట్టు : 60వేల ఎకరాలు

స్థిరీకరణ : 2.78 లక్షల ఎకరాలు

సామర్థ్యం : 11.63 టీఎంసీలు(120 రోజులు పంపింగ్‌)

‘ఏడాదిలోగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఈనెలాఖరులోగా జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్షించి ఎన్ని నిధులు కావాలో.. వెంటనే ఇచ్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.’

– సీఎం రేవంత్‌రెడ్డి

‘మల్కపేట రిజర్వాయర్‌తోపాటు నర్మాల ఎగువమానేరు వరకు అన్ని రిజర్వాయర్లను నింపి కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.’

– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి

పనులు చేయాలని నోటీసులిచ్చాం

మల్కపేట రిజర్వాయర్‌లోకి మధ్యమానేరు నీటిని పంపింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తి కాగానే పంపింగ్‌ ప్రారంభిస్తాం. గంభీరావుపేట మండలం నాగంపేట వద్ద పంపుహౌస్‌లో సివిల్‌ పనులు చేయాలని, పంపులను, మోటార్లను బిగించాలని కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు ఇచ్చాం. అక్కడ పనులు పూర్తయితేనే ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరుతాయి. సమగ్ర వివరాలను ప్రభుత్వానికి నివేదించాం.

– అమరేందర్‌రెడ్డి,

నీటిపారుదలశాఖ ఈఈ, సిరిసిల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!1
1/2

‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!

‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!2
2/2

‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement