● నేటితో ముగియనున్న వివరాల సేకరణ
97.82 శాతం సర్వే పూర్తి
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తుది దశకు చేరింది. ఈనెల 9న ప్రారంభమైన సర్వే శుక్రవారం నాటికి పట్టణాల్లో 98.28 శాతం, గ్రామాల్లో 97.68 శాతం పూర్తయింది. జిల్లాలోని 261 గ్రామాలను 1,531 ఎన్యుమరేషన్ బ్లాకులుగా గుర్తించారు. ఆయా బ్లాకుల్లో 1,92,432 ఇళ్లకు ఇప్పటి వరకు 1,88,246 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. ఈనెల 23వ తేదీతో సర్వే పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
మొదట్లో నత్తనడకన..
గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లో మొదట్లో సర్వే నత్తనడకన సాగింది. దీన్ని గుర్తించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఈనెల 12న ఒకసారి, 17న మరోసారి అధికారులతో సమీక్ష చేసి, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 75 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో కుటుంబానికి అరగంట నుంచి గంట సమయం పట్టింది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల నుంచి అధికారులకు సహకారం అందింది. ఇప్పటికే 97.82 శాతం వరకు సర్వే పూర్తికాగా.. తాళం వేసిన ఇళ్లు మాత్రమే మిగిలి పోయినట్లు సమాచారం.
జిల్లాలోని గ్రామాలు : 261
ఎన్యుమరేటర్ బ్లాకులు: 1,531
సర్వేకు గుర్తించిన కుటుంబాలు : 1,92,432
22 వరకు సర్వే చేసిన కుటుంబాలు : 1,88,246
పట్టణాల్లో సర్వే : 98.28 శాతం
గ్రామీణ ప్రాంతాల్లో.. : 97.68 శాతం
Comments
Please login to add a commentAdd a comment