‘ఇందిరమ్మ’ వివరాలు సేకరించాలి
● పకడ్బందీగా గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 80 లక్షల మంది వివరాలను డిసెంబర్ నెలాఖరులోగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవం, సంక్షేమహాస్టల్స్ తనిఖీపై సమీక్షించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్, ఖీమ్యానాయక్‌లతో పాల్గొన్నారు. ప్రతీ 500 ఇళ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోను నమోదు చేయాలన్నారు. పిల్లలకు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిందని, ఈనెల 14న డైట్‌చార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు సూచించారు. గ్రూప్–2 పరీక్షలను ఈనెల 15, 16 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,70,398 దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు 1,498 దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేస్తామన్నారు. గ్రూప్–2 పరీక్షల కోసం 26 కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, బీసీ సంక్షేమాధికారి రాజా మనోహర్, మైనార్టీ శాఖ ఓఎస్డీ సర్వర్‌మియా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు సిద్ధం చేసే ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. స్టోర్‌రూంలోని బియ్యం, కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలు పరిశీలించారు. విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్, డీసీవో శ్రీనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment