రైతులకు శాపం | - | Sakshi
Sakshi News home page

రైతులకు శాపం

Published Fri, Dec 13 2024 1:06 AM | Last Updated on Fri, Dec 13 2024 1:06 AM

రైతుల

రైతులకు శాపం

సీఈవో పాపం..
● రైతుల పేరిట అదనపు రుణాలు ● సహకారం ముసుగులో స్వాహాపర్వం ● రూ.2లక్షలు దాటడంతో రుణమాఫీకి దూరం ● 57 మంది రైతుల పరిస్థితి ఆగమ్యగోచరం ● ఆందోళనలో అన్నదాతలు

ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు ఏరువా తిరుపతి. చందుర్తి మండలం తిమ్మాపూర్‌ స్వగ్రామం. చందుర్తి సింగిల్‌విండో ఆఫీస్‌లో పంట రుణం రూ.1.40 లక్షలు తీసుకున్నాడు. ఇదే రైతు పేరిట సీఈవో అదనంగా మరో రూ.1.60 లక్షలు తీసుకున్నారు. కాగా ఈ రైతు ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల్లోపు రుణమాఫీ పేరు రాకపోవడంతో సింగిల్‌విండో కార్యాలయానికి, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఇతని పేరిట రూ.3లక్షల పంట రుణం ఉందని తెలపడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని చందుర్తి సీఈవోను ప్రశ్నించగా.. అదనంగా తీసుకున్న రూ.1.60లక్షలు వాపసు ఇచ్చాడు. కానీ తిరుపతి రుణమాఫీకి దూరమయ్యాడు.

చందుర్తి(వేములవాడ): అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా ఉంటుందంటే.. చందుర్తి సింగిల్‌విండోలోని 57 మంది రైతుల పరిస్థితిలా ఉంటుంది. రైతులకు సేవలందించాల్సిన సింగిల్‌విండో సీఈవోనే అక్రమాలకు పాల్పడడంతో సదరు రైతులు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి దూరమయ్యారు. సింగిల్‌విండో పరిధిలోని 57 మంది రైతులు పేరిట వారికే తెలియకుండా ఆ సీఈవో ఒక్కొక్కరి పేరిట అదనంగా రూ.2లక్షల చొప్పున రుణం తీసుకున్నాడు. వారి పేరు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో లేకపోవడంతో ఆరా తీయగా.. అసలు విషయం వెలుగుచూసింది.

రైతులను మభ్యపెడుతున్న అధికారులు

చందుర్తి సింగిల్‌విండో పరిధిలో 37 మంది రైతుల పేరిట అదనంగా రూ.34.20 లక్షలు సింగిల్‌విండో సీఈవో కాజేశాడని జిల్లా సహకార సంఘం అధికారి ఫిర్యాదు చేశారు. రైతులు పేరిట అదనంగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించినప్పటికీ ఆయా రైతులకు రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా అదనపు రుణం తీసుకున్న కొందరు రైతుల వద్దకు వెళ్లి ముందుగానే వారి పేరిట తీసుకున్న రుణాన్ని చెల్లిస్తామని ఒప్పందం చేసుకోవడంతో వారు జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేయకుండా వెనుకడుగు వేశారు. వారి సంఖ్య కూడా 35 మందికి పైగానే ఉన్నారని పాలకవర్గ సభ్యులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

వాటాధనం కూడా స్వాహా

సహకార సంఘంలో రైతులు పంటరుణం ఇచ్చే సమయంలో రైతుకు ఇచ్చే అప్పులో 10 శాతం వాటాధనం పట్టుకుని మిగితా సొమ్మును అందజేస్తారు. కానీ రుణమాఫీ అయిన రైతులు తిరిగి రుణం తీసుకుంటే మీ వాటాధనం లేదని తిరిగి కొందరు రైతుల వాటాధనం మళ్లీ పట్టుకుంటున్నారని, నర్సింగాపూర్‌కు చెందిన ఓ మహిళ రైతులు అధికారులతో గొడవకు దిగిన పట్టించుకోకుండా 10 శాతం సొమ్మును పట్టుకున్నారు. కాగా నర్సింగపూర్‌కు చెందిన డైరెక్టర్‌ మాత్రం రికార్డు చూసి తిరిగి ఇప్పిస్తానని మాట ఇవ్వడంతో ఆమె ఆఫీస్‌లో నుంచి రుణం తీసుకుని వెనుదిరిగింది.

విచారణ పేరిట కాలయాపన

● చందుర్తి సింగిల్‌విండో కార్యాలయంలో ఎటూ చూసిన అక్రమాలే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

● ఎరువుల బస్తాలను రైతులకు ఓ ధరకు విక్రయించి, విక్రయ రిజిష్టర్‌లో మరో రూ.30 తక్కువగా రాశారనే ఆరోపణలు ఉన్నాయి.

● గన్నీ సంచులను సైతం ప్రైవేట్‌ వ్యాపారులకు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

● అధికారులు విచారణ చేసేందుకు మూడు నెలలుగా కాలయాపన చేయడంపై వారి నిజాయితీని కూడా రైతులు శంకిస్తున్నారు.

అప్పు చెల్లించినా.. మళ్లీ చూపిస్తోంది

చందుర్తి సింగిల్‌విండోలో పంట అప్పుగా రూ.1.60లక్షలు తీసుకున్నాను. నాకు తెలియకుండానే సీఈవో రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయినా కూడా పంటరుణం కింద తీసుకున్న రూ.1.60 లక్షలు చెల్లించిన కూడా, నాకు రూ.2.80లక్షల అప్పు ఉన్నట్లుగానే చూపిస్తోంది. నాకు న్యాయం జరిగేదెట్లా. – కుమ్మరి మల్లయ్య, చందుర్తి

విచారణ కొనసాగుతోంది

చందుర్తి సింగిల్‌విండో పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. రైతులను విచారణ చేస్తాం. అక్రమాలపై వచ్చే ప్రతీ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశాం. సంఘంలో జరిగిన ప్రతీ అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తాం.

– రామకృష్ణ, జిల్లా సహకార అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
రైతులకు శాపం1
1/3

రైతులకు శాపం

రైతులకు శాపం2
2/3

రైతులకు శాపం

రైతులకు శాపం3
3/3

రైతులకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement