కాలువమట్టి.. కాసుల వర్షం
● యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా ● వరదకాలువ మట్టిమాయం ● మట్టి రవాణాతో సాగులోకి ఖాళీ స్థలాలు ● సర్కారు ఖజానాకు కన్నం
బోయినపల్లి(చొప్పదండి): వరదకాల్వ మట్టి అక్రమార్కులకు కాసులవర్షం కురిపిస్తోంది. యథేచ్ఛగా తరలిస్తూ క్యాష్ చేసుకుంంటున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్, మర్లపేట, దేశాయిపల్లి, రత్నంపేట, వరదవెల్లి గ్రామాల మీదుగా నిర్మించిన వరదకాలువ, జగ్గారావుపల్లి వెంకట్రావుపల్లి వరకు ఉన్న ఉపకాలువ కట్టల మట్టిని అక్రమ రవాణాదారులు కొల్లగొడుతున్నారు.
వరదకాలవ్వ 20 కిలోమీటర్లు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్, లక్ష్మీపూర్ 102 కిలోమీటర్ల వరదకాలువ పరిసరాల నుంచి గంగాధర మండలం కురిక్యాల, గర్శకుర్తి గ్రామాల మీదుగా బోయినపల్లి మండలం విలాసాగర్, మర్లపేట, దేశాయిపల్లి, జగ్గారావుపల్లి మీదుగా వరదవెల్లి క్రాస్ రెగ్యులేటరీ వరకు 122 కిలోమీటర్లు(20 కిలోమీటర్ల మేర) సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించారు. వరదకాలువ వంద మీటర్ల వెడల్పు, 20 మీటర్ల లోతు ఉంటుంది. వరదకాలువ తవ్విన మట్టిని ఇరువైపులా పోశారు. కాలువకు రెండువైపులా సుమారు 60 నుంచి 100 మీటర్ల వరకు స్థలం ఉంటుంది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా వరదకాల్వలు నిర్మించారు.
మట్టి మాయం.. భూములు అన్యాక్రాంతం
వరదకాలువ మట్టి అక్రమ రవాణా చేసిన ప్రాంతాల్లోని స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు ఆ భూములను చదునుచేసి సేద్యం చేస్తున్నారు. మరికొందరు ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్‌శాఖ అధికారులు ఖాళీ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విలువైన స్థలాలు కాపాడుతామని చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో వరదకాలువ కట్టల మట్టి గత ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. వెంచర్లకు, ఫ్యాక్టరీల నిర్మాణాల బేస్‌మెంట్, రోడ్ల ఫార్మేషన్, వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేందుకు, ఇలా పలు అవసరాలకు మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు.
మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు
బోయినపల్లి మండలంలో వరదకాలువ మట్టి అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ సిబ్బందితో నిఘా పెట్టిస్తాం. ఇటీవల మట్టి టిప్పర్లు పట్టుకుని మైనింగ్ అధికారులకు రాస్తే జరిమానా విధించారు. మట్టి అక్రమ రవాణా జరుగకుండా చూడాలని ఆర్‌ఐకి చెబుతాం.
– కాలె నారాయణరెడ్డి,
తహసీల్దార్, బోయినపల్లి
Comments
Please login to add a commentAdd a comment