కారుణ్య నియామకాల కోసం వినతి
గజ్వేల్‌రూరల్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) వ్యవస్థలో 61 ఏళ్లు పైబడిన వారి వారసుల కారుణ్య నియామకాలు చేపట్టి ఆదుకోవాలని పలువురు వీఆర్‌ఏలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గజ్వేల్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి విద్యార్హతను బట్టి వివిధ శాఖలకు కేటాయించిందని గుర్తుచేశారు. 61 ఏళ్లు పైబడిన వారసుల నియామకాలు జరపకపోవడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా 3,797 మంది వీఆర్‌ఏలకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అందులో 265 మంది మృతి చెందారని తెలిపారు.దీక్షలో వీఆర్‌ఏల సంఘం నాయకులు నీరుడి నర్సయ్య, వెంకటయ్య, ఐలయ్య, భిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన
సిద్దిపేటరూరల్: తమను రెగ్యులర్ చేసి పేస్కేలు వర్తింపజేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన దీక్ష చేపట్టారు. తమను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ డిమాండ్ చేశారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. పదవీ విరమణ చేస్తే రూ. 10లక్షలు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు.
అట్రాసిటీ కేసుల్లో 41 సీఆర్‌పీసీని వర్తింపజేయుద్దు
గజ్వేల్: అట్రాసిటీ కేసుల్లో 41 సీఆర్‌పీసీని వర్తింపజేయొద్దని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) విజ్ఞప్తి చేసింది. శనివారం న్యూఢిల్లీలో కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యాను వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, జాతీయ కార్యదర్శి పి.శంకర్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఒకవైపు పెచ్చరిల్లుతుండగా, స్టేషన్ బెయిల్ తీసుకునే అవకాశం లభించడంతో నిందితుల ప్రవర్తనలో మార్పు ఉండటం లేదన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీయవద్దని కోరారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం: సీపీ
సిద్దిపేటకమాన్: డ్రగ్స్ రహిత జిల్లా గురించి ప్రతిఒక్కరూ సహకరించాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రికవరీ చేసిన ప్రాపర్టీ కేసులు, ప్రజలకు అందించిన సేవల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 1500మంది విద్యార్థులు పలు రకాల ఆయుధాలు, సీసీ కెమెరాలు, స్పీడ్ లేజర్ గన్ పనితీరు, ట్రాఫిక్ రూల్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, డాగ్ స్క్వాడ్, సైబర్ క్రైమ్ తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేసి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. విద్యార్థులకు, మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించామని సీపీ అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి డయల్ 100, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ప్రీ నంబర్‌ల గురించి అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment