సింగర్ శంకర్‌బాబుకు సన్మానం
హుస్నాబాద్: పుష్ప 2 సినిమాలో పాట పాడిన సింగర్ బత్తుల శంకర్‌బాబును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఘనంగా సన్మానించారు. ఆదివారం రాత్రి పట్టణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన శంకర్ బాబు వందలాది జానపద పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాలోనూ ‘పీలింగ్స్’ అనే పాట పాడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సన్మానం సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ పాటే ప్రాణంగా ఎన్నో పాటలు పాడిన శంకర్‌బాబు ఎంతోమంది అభిమానులను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చిత్తారి పద్మ, మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్, న్యాయవాది చిత్తారి రవీందర్, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కళాకారులు పాల్గొన్నారు.
కార్యకర్తల సంక్షేమంపై
ప్రత్యేక దృష్టి
గజ్వేల్: కార్యకర్తల సంక్షేమంపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించిందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. వారం రోజుల క్రితం పట్టణంలోని పదో వార్డుకు చెందిన చిక్కుడు కిరణ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం బాధిత కుటుంబీకులకు పార్టీ తరపున రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా నిలుస్తోందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో 97,500 పార్టీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఇప్పటివరకు 380 మృతుల కుటుంబాలకు రూ.7.6కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేసిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్య పారాయణం..
భక్తిపారవశ్యం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం అర్చనలు, పారాయణాలతో అలరారింది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఆలయ మండపంలో వేదపండితులు నిర్వహించిన ఆదిత్య హృదయ పారాయణం, సామూహిక కుంకుమార్చనలో భాగస్వాములయ్యారు. ఈఓ అన్నపూర్ణ పర్యవేక్షణలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
పర్యాటక కేంద్రంగా
‘సింగూరు’
మంత్రి దామోదర రాజనర్సింహ
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రం (టూరిజం హబ్)గా మారుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా అక్కడి స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు నీటి మధ్య భాగంలో ఉన్న పడకంటి గడ్డపై టూరిజం అభివృద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుల సమస్యలపై ఆరా తీశారు. అయితే సింగూరు కాలువలు పూర్తయి దశాబ్దం గడిచినా వాటికి సిమెంట్ లైనింగ్ చేయలేదు. మంత్రి దామోదర చొరవతో కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయడానికి రూ.160 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శంకుస్థాపన చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. వచ్చే ప్రజలకు వసతుల కల్పనపై నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment