గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల వివరాలను నమోదు చేస్తున్న ఉపాధ్యాయులు
వన్ నేషన్.. వన్ స్టూడెంట్ కార్డు
పాఠశాలలో విద్యార్థుల వివరాలు నమోదు
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని వివరాలు నిక్షిప్తం
జిల్లాలో 1.84 లక్షల మంది విద్యార్థులు
ఇప్పటి వరకు 10వేల మందివే నమోదు
ఆధార్ కార్డు తరహాలో విద్యార్థి గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. వన్ నేషన్.. వన్ స్టూడెంట్ పేరిట అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అందజేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వివరాలను యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 మంది విద్యార్థుల వివరాలను అపార్‌లో నమోదు చేశారు. త్వరలో కార్డులను జారీ చేయనున్నారు.
సాక్షి, సిద్దిపేట: ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు అపార్ కోసం ఏ వివరాలు సేకరించాలి, ఎలా నమోదు చేయాలి అనే దానిపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, మోడల్, రెసిడెన్షియల్, కేజీబీవీలు, ప్రైవేట్ స్కూల్‌లలో మొత్తంగా 1,84,700 మంది విద్యార్థులకు గాను 10,050 మంది విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఆధార్‌లోనూ ఒకే విధంగా ఉండాలి
పాఠశాలలో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకే విధంగా ఉంటేనే అపార్ నంబర్ వస్తుంది. ఒకే విధంగా లేని వారికి సమస్య వస్తోంది. పాఠశాలల్లోని వివరాలు మార్చేందుకు వీలుండదు. అయితే ఆధార్‌లో వివరాలు మార్పునకు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో మార్పులు ఉండటంతో అపార్ నమోదులో సమస్యలు వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేరు, పుట్టిన తేదీ మార్పు కోసం చాలా మంది విద్యార్థులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
విద్యాసంస్థ విద్యార్థుల నమోదైన వారు సంఖ్య
ప్రాథమిక 70,221 6,487
ప్రైవేట్ 71,598 2,632
కేజీబీవీలు 4,986- 474
ఉన్నత పాఠశాలలు 13,012- 132
మోడల్ స్కూల్స్ 8,520 262
రెసిడెన్షియల్ 16,363 63
31లోగా పూర్తి చేయాలి
ఈ నెల 31వ తేదీ లోగా అపార్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల అడ్మిషన్ రికార్డు, ఆధార్ కార్డులోని వివరాలన్నీ ఒకే విధంగా ఉంటేనే అపార్ జనరేట్‌కు అర్హులు అవుతారు. వివరాలు అందించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి.
–వై నర్సింహులు, ఏఎస్‌ఓ, విద్యాశాఖ
వివరాలు నిక్షిప్తం
అపార్ గుర్తింపు కార్డు కోసం విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నందున ఆ విద్యార్థి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశారు. అపార్ కార్డు ద్వారా విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, క్యూ ఆర్ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబర్ కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. దీంతో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ ఎక్కడ చదివారన్న వివరాలు ఇట్టే ప్రత్యక్షమవుతాయి. అపార్ గుర్తింపు వల్ల డిజిటల్ లాకర్‌కు అనుసంధానం అవుతారు. దీంతో అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యార్థి సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు, వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయంలో, ఇతర అంశాల్లో అపార్ కార్డు ఆధారంగా సమాచారం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment