సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తగదు ● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ● సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ● రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు
సిద్దిపేటకమాన్: తెలంగాణ తల్లి అందరికీ దేవత అని.. కానీ విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేం చేశారు. బతుకమ్మ ఆట, పాటలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని అవమానపర్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. బతుకమ్మను తొలగించడంతో చరిత్ర క్షమించదన్నారు. ఇరవై ఏళ్ల కిందటే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని అన్నారు. చేతిలో జొన్న కర్ర పెట్టగానే సరిపోదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్‌ఎస్ నాయకులు నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచంలోని అని దేశాల్లో బతుకమ్మ ఆడుతున్నారని అందుకు గర్వంగా ఉందన్నారు. బతుకమ్మకు రెండు చీరలు ఇస్తానన్న సీఎం హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజశర్మ, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, మాజీ ఎంపీపీ శ్రీదేవి, పట్టణ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment