
ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓటమి
మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్
కరుణ్ నాయర్ మెరుపులు వృథా
12 పరుగులతో ముంబై గెలుపు
వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్ పడింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట తిలక్ వర్మ, సూర్యకుమార్ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది.
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
ఆఖర్లో నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్ పొరెల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్ శర్మ, కుల్దీప్, మోహిత్ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ శర్మ 3 వికెట్లు, సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు.
తిలక్ తడాఖా...
గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్ రెండో ఓవర్‌లో సిక్సర్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్‌లో రికెల్టన్ 2 ఫోర్లు, రోహిత్ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ (12 బంతుల్లో 18)ను లెగ్‌స్పిన్నర్ విప్రాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్ కోల్పోగా... సూర్యకుమార్ బాధ్యతాయుతంగా ఆడాడు.
మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్ కూడా ఔట్ కాగా... తిలక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్ కాగా... తిలక్‌కు నమన్ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్ 26 బంతుల్లో ఈ సీజన్‌లో రెండో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కదంతొక్కిన కరుణ్..
దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్‌సెంచరీ చేయని నాయర్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మెక్‌గుర్క్ (0) ఔట్ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అడుగుపెట్టిన నాయర్... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్‌లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు.
స్టార్ పేసర్ బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో 6, 4, 6తో కరుణ్ 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్‌లో 6, 4 కొట్టిన నాయర్... కరణ్ శర్మ ఓవర్‌లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్ ఔట్ కాగా... మరో ఫోర్ కొట్టిన అనంతరం కరుణ్ వెనుదిరిగాడు.
కెప్టెన్ అక్షర్ పటేల్ (9), స్టబ్స్ (1) విఫలం కాగా... కేఎల్ రాహుల్ (15), అశుతోష్ శర్మ (17), విప్రాజ్ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 18; రికెల్టన్ (బి) కుల్దీప్ 41; సూర్యకుమార్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 40; తిలక్ (సి) పొరెల్ (బి) ముకేశ్ 59; హార్దిక్ (సి) స్టబ్స్ (బి) విప్రాజ్ 2; నమన్ (నాటౌట్) 38; జాక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్: స్టార్క్ 3–0–43–0; ముకేశ్ 4–0–38–1; విప్రాజ్ నిగమ్ 4–0–41–2; కుల్దీప్ 4–0–23–2; అక్షర్ 2–0–19–0; మోహిత్ 3–0–40–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జాక్స్ (బి) దీపక్ చహర్ 0; పొరెల్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 33; కరుణ్ నాయర్ (బి) సాంట్నర్ 89; రాహుల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 15; అక్షర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 9; స్టబ్స్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 1; అశుతోష్ (రనౌట్) 17; విప్రాజ్ నిగమ్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 14; స్టార్క్ (నాటౌట్) 1; కుల్దీప్ (రనౌట్) 1; మోహిత్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–24–1; బౌల్ట్ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్ 4–0–43–2; హార్దిక్ పాండ్యా 2–0–21–0; కరణ్ శర్మ 4–0–36–3.
ఐపీఎల్‌లో నేడు
లక్నో X చెన్నై
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం