అయ్యో.. ఓ.. వలస కూలీ
●
స్వర్ణోత్సవాలు.. అర్ధశతాబ్ది ఉత్సవాలు, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే భారతావనిలో వలస కూలీల బతుకుల్లో ఆనందోత్సవాలు అంతర్ధానం అయ్యాయి. పుట్టిన ఊరు, బతికిన పల్లెలో బతుకుదెరువు దొరక్క కాలే కడుపులను చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వారంతా వస్తున్నారు. కన్న వారికి, కడుపున పుట్టిన బిడ్డలకు పట్టెడన్నం పెట్టేందుకు పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఊరుగాని ఊరులో ఆపదొస్తే.. ఆదుకోవాల్సిన వారు మానవత్వాన్ని మరిచి వారి మానాన వారిని వదిలేస్తున్నారు. విధి వశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్న వలస కూలీలు ఆత్మీయుల కడసారి చూపులకు నోచుకోలేకపోతున్నారు.
ఇటీవల విడవలూరులో గుండెపోటుతో మృతి చెందిన ఉమిత్ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు (ఫైల్)
కోవూరు: రెక్కాడితే కానీ డొక్కాడని వలస బతుకులు. కళ్లల్లో కన్న వాళ్లు, బిడ్డలు కదిలాడుతున్నా.. వారి కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టేందుకు ఊరుదాటి నూర్ల మైళ్లు.. కట్టుబట్టలతో కాలికి బలపం కట్టుకుని వారంతా వచ్చారు. ఆకలి దప్పులతో పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా.. కష్టానికి తగిన ఫలితం రాక.. తమ వారి ఆకలి తీర్చేందుకు కన్నీళ్లు మింగుతూ పరాయి పంచన బతుకున్నారు. వీరి కష్టాన్ని దోచుకుంటూ దళారులు జేబులు నింపుకుంటున్నారు. విధితోపాటు దళారులు వారి జీవితాలను ఆడుకుంటున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో ఆత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరుగుతోంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాగుకు సంబంధించి నాట్లు ముమ్మరంగా జరుగుతాయి. స్థానికంగా వరినాట్లు వేసేందుకు కూలీల కొరత ఉండడంతో కొన్నేళ్ల క్రితం వరకు ఉమ్మడి శ్రీకాకుళం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూలీలు వచ్చి వరినాట్లు వేసే పరిస్థితి ఉండేది. అయితే కొన్నేళ్లుగా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి వర్షాలు కురుస్తుండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు రావడం తగ్గింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కొందరు మేసీ్త్రలు పక్క రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి వరినాట్లు వేయిస్తూ వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారు. వీరు పని వేగంగా చేయడం, తక్కువ రేటుకు దొరుకుతుండటంతో స్థానిక రైతులు కూడా ఎక్కువగా వారిపైనే ఆధారపడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో పెన్నార్ డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం విస్తృతంగా వరినాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాలకు కూలీల ముఠాలు వచ్చాయి.
కష్టం దోపిడీ.. ఆలనా పాలన గాలికి..
జిల్లాలో వరినాట్లు పనులకు వివిధ రాష్ట్రాల నుంచి ఈ సీజన్‌లో దాదాపు 10 వేల మంది వస్తున్నట్లు సమాచారం. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి. వ్యవసాయ నాట్లు పూర్తయ్యాక కాస్తో కూస్తో కూడబెట్టుకుని తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోతారు. అయితే అక్కడి నుంచి కూలీలను తీసుకువస్తున్న మేసీ్త్రలు వారి కష్టాన్ని దోచుకుంటున్నారే తప్ప.. ఆలనా పాలనా పట్టించుకోవడం లేదు. విధివశాత్తు ఏదైనా విషాద పరిస్థితులు జరిగితే.. కనీసం మానవత్వం కూడా చూపించడం లేదు. కూలీలను జట్లు జట్లుగా విభజించి వారికి దక్కే కూలీని కాజేస్తున్నారు. ఇక్కడ సాధారణంగా ఎకరం వరినాటు వేసేందుకు రూ.4,500 రైతులు చెల్లిస్తున్నారు. అయితే మేసీ్త్రలు ఆ కూలీలకు కేవలం రూ.3 వేలు వంతున ఇస్తున్నారు. 8 మంది జట్టు రోజుకు 3 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల చలి వాతావరణంలో చల్లని నీటిలో, బురదలో పని చేస్తే ఒక్కొక్కరికి రోజుకు రూ.1,125 దక్కితే.. ఇందులో బెంగాల్ నుంచి ఇక్కడ పనులకు పంపించిన ఏజెంట్‌కు ఒక్కొక్కరు రోజుకు రూ.300 చెల్లించాలి. ఇలా రోజంతా కష్టపడితే కూలీలకు దక్కేది కేవలం రూ.825 మాత్రమే. కూలీల నుంచి ఇంత దోచుకుంటున్న ఏజెంట్, మేసీ్త్రలు వారికి ఏదైనా ఆపద వస్తే.. వారిని వారి మానాన వదిలేస్తున్నారు. వలస వచ్చే కూలీల కుటుంబానికి ముందుగా రూ.2 వేల పెట్టుబడి ఇస్తారు. ఇక్కడ చేసిన పనికి కూలి డబ్బులు కూడా దళారుల ద్వారానే అందుతాయి.
అప్పుడు చాలా భయమేసింది
విధి వికటించి.. తనువు చాలించి..
ఆ నాట్లకు మనకు తేడా ఉంది
ప్రస్తుత సీజన్‌లో జరుగుతున్న వరి నాట్లు కోసం బెంగాల్, ఉతరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారు. వీరి వేసే వరినాట్ల విధానానికి, మనకు చాలా తేడా ఉంది. వీళ్లు వేసే నాట్లకు దిగుబడులు కూడా పెరుగుతుండడంతో, నాట్లు కూడా త్వరగా పూర్తవుతుండడంతో అందరూ వీరితో వేయిస్తున్నారు.
– మోచర్ల శ్రీనివాసులు, పడుగుపాడు
పనుల కోసం వచ్చిన కూలీల్లో కొందరి జీవితాలు విషాదాంతంగా ముగుస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లో విధివశాత్తు వారం రోజుల్లో ముగ్గురు కూలీలను మృత్యువు కబళించింది. అయితే వీరి మృతదేహాలను స్వస్థలానికి తీసుకెళ్లడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక.. అండగా నిలిచే దిక్కులేక.. పుట్టిన ఊరులో అయిన వాళ్లు, ఆత్మీయుల కడసారి చూపునకు నోచుకోక ఇక్కడే ఖననం చేసి పుట్టెడు దుఃఖంతో సహచరులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ నెల 20న విడవలూరులో పొలంలో పనిచేస్తుండగానే పశ్చిమబెంగాల్‌కు చెందిన ఉమిత్ (30) కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు అతన్ని స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే పశ్చిమబెంగాల్ నుంచి తీసుకువచ్చిన మేసీ్త్ర పట్టించుకోలేదు. తల్లితో పాటు కుటుంబ సభ్యులు చేతిలో చిల్లిగవ్వలేక.. స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లలేక, పీహెచ్‌సీ వెనుక ప్రాంతంలో ఖననం చేసి పుట్టెడు దుఃఖంతో సొంతూరుకు వెళ్లిపోయారు. ఈ నెల 23న కోవూరులో వరినాట్లకు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీకి చెందిన సుసేన్ సర్ధార్ (30) దుర్మరణం చెందాడు. ఈ నెల 27న బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో వరినాట్ల కోసం వచ్చిన కూలీల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన విశ్వజిత్ మండల్ (40) అర్ధరాత్రి వేళ కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటి వెళ్తుండగా బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాహనం ఢీకొని దుర్మరణం చెందాడు. తోటి కూలీలు, బంధువులు అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు.
జిల్లాలో ముమ్మరంగా వరినాట్లు
పనుల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఏటా 10 వేల మంది రాక
వలస కూలీల కష్టాన్ని
దోచుకుంటున్న దళారులు
పొద్దస్తమానం కష్టించినా దక్కని
గిట్టుబాటు కూలీ
విధివశాత్తు ఇటీవల
ముగ్గురు కూలీల మృతి
చేతిలో చిల్లిగవ్వలేక.. మృతదేహాలను స్వస్థలానికి తీసుకెళ్లలేక..
ఆత్మీయుల కడచూపులకు
నోచుకోక ఇక్కడే అంత్యక్రియలు
మా ఊరు నుంచి కూలి పనులకు వలస వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనుకోని కొన్ని సంఘటనలు జరిగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది. మా ప్రాంతం నుంచి వచ్చిన వారిలో ముగ్గురు చనిపోయారని తెలిసి బాధపడ్డాం. కానీ కుటుంబ పోషణకు తప్పని పరిస్థితి మాది.
– కక్కోన్ సర్దార్, పశ్చిమబెంగాల్
Comments
Please login to add a commentAdd a comment