వైఎస్సార్‌సీపీ హయాంలో పరిహారం
కావలి: మత్స్యకారులకు వేట నిషేధ సాయం అందజేయడానికి ఈ ఏడాదికి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ‘సారీ’ చెప్పింది. ఎన్నికలకు ముందు పరిహారం అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి చిప్ప చూపించారు. సముద్రంలో చేపలు పిల్లలు పొదిగే కాలం ఏప్రిల్ 15 నుంచి జాన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులు వేట నిషేధం అమలవుతోంది. ఈ సమయానికి 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లకు గాను నాలుగేళ్లు అది కూడా అరకొర మందికి ఏడాదికి రూ.4 వేల చొప్పున అందించింది. చివరి ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఎగ్గొట్టింది. 2019లో వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వం కంటే మిన్నగా 15,050 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పరిహారాన్ని కూడా పెంచి ఒక్కొక్కరికి రూ.10 వేలు వంతున అందించారు. ఈ లెక్కతో పోల్చితే టీడీపీ హయాంలో ఏడాదికి జిల్లా మొత్తంగా ఐదారు వేల మందికి కూడా పరిహారం అందించలేదని ఆనాటి గణాంకాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల లెక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎగ్గొట్టేందుకు సాకులు చెబుతూ సర్వే చేస్తున్నామంటూ ప్రస్తుతానికి భరోసా ఇవ్వలేమని సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రూ.20 వేలిస్తామని.. అసలుకే మోసం
అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఏటా వేట నిషేధ పరిహారాన్ని ఉదారంగా అందించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి పరిహారం పెంపు వరకు గత టీడీపీ ప్రభుత్వం కంటే మిన్నగా అందించింది. ఏటా జూన్ చివరి వారంలో కానీ, జూలై నెలలోగాని గత ప్రభుత్వం ఠంచన్‌గా అందించింది. అయితే ఈ పరిహారాన్ని మరింతగా పెంచి రూ.20 వేలు చొప్పున ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన నెలలోనే పరిహారం ఇవ్వడానికి వీలుగా అర్హులైన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసినప్పటికీ ఆ ఊసే లేదు. కనీసం ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున అందిస్తారని మత్స్యకారులు భావించారు. అయితే ఈ ఏడాదికి పరిహారం ఇవ్వడం వీలు పడదని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
టీడీపీ హయాంలో
తొలి రెండేళ్లు రూ.2 వేలే పరిహారం
2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం 2014–15, 2015–16 సంవత్సరాల్లో ఏడాదికి రూ.2 వేలే పరిహారం అందించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో రూ.4,000 వంతున ఇచ్చింది. ఐదో ఏడాది 2018–19 బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి రూ.10,000 వంతున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుని, టీడీపీ ప్రభుత్వం ఎగనామం పెట్టిన చివరి ఏడాది 2018–19 బకాయిలు చెల్లింపుతోనే వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న అర్హుడైన ప్రతి మత్స్యకారుడుకి ప్రభుత్వం వైఎస్సార్ మత్సకార భరోసా కింద రూ.10,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుండేది.
ఏడాది లబ్ధిదారులు పరిహారం
2019 15,050 మంది రూ.15,05,00,000
2020 10,112 మంది రూ.10,11,20,000
2021 10,235 మంది రూ.10,23,50,000
2022 10,689 మంది రూ.10,68,90,000
2023 12,072 మంది రూ.12,07,21,000
2024 12,444 మంది (టీడీపీ అధికారం)
ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని
ఎన్నికల్లో హామీ
అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం ఇవ్వలేమని
సంబంధిత శాఖ మంత్రి వెల్లడి
ఆర్థిక సాయం ఎగనామం పెట్టడానికి సాకులు
Comments
Please login to add a commentAdd a comment