మోసపోయా
నెల్లూరు(క్రైమ్): కొలువుల వేటలో ఉన్నవాళ్లు, చదువుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉద్యోగాలు, రూ.లక్షలు ప్యాకేజీ అంటూ ఆశ చూపి అందినకాడికి దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రతి సోమవారం నెల్లూరులో జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.
మాయమాటలు చెప్పి..
కొందరు వ్యక్తులు కొలువుల వల వేస్తూ నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులే లక్ష్యంగా రూ.లక్షలు దోచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే ఆర్థికంగా స్థిరపడొచ్చని, కుటుంబం కష్టాల్లో నుంచి గట్టెక్కుతుందని నమ్మించి నగదు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడి పోయినట్లేనని, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదని, ఖర్చుకు వెనుకాడకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి ఉచ్చులోకి దింపుతున్నారు. డబ్బు చేతికందాక మాయమైపోతుండగా.. మరికొందరు తమకున్న పలుకుబడితో బాధితులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో పలువురు మోసం చేయడాన్నే వృత్తిగా పెట్టుకున్నారు.
మోసపోతున్నారిలా..
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి. ముందుగా ప్రకటన ఇచ్చి రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. డబ్బులు కట్టించుకుని జాబ్ ఇవ్వరు. అనేకమందికి దీనిపై కనీస అవగాహన లేకపోవడంతో మోసాలకు గురవుతున్నారు. జీవితంలో స్థిరపడొచ్చని గుడ్డిగా నమ్మి రూ.లక్షలు ధారపోస్తున్నారు.
సోషల్ మీడియాలో..
ఉన్నత చదువులు అభ్యసించిన వారు ఉద్యోగాన్వేషణలో భాగంగా సోషల్ మీడియాలో మోసగాళ్లు ఇచ్చే ప్రకటనలు, మోసపూరిత కన్సల్టెన్సీలను నమ్మి వారిని సంప్రదిస్తున్నారు. దేశ, విదేశాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వెంటనే ముందు, వెనుకా ఆలోచించకుండా డబ్బు ఇస్తున్నారు.
ఇవి గుర్తుంచుకోవాలి
డబ్బులు కట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరనే విషయాన్ని గమనించాలి. ఉద్యోగ ప్రకటన సరైనదో కాదో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఉన్న మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోరాదు. ఒకసారి ఆ సంస్థ ప్రధాన కార్యాలయం లేదా శాఖ కార్యాలయానికి వెళ్లి నిర్ధారించుకోవాలి.
పరువు పోతుందని..
ఉద్యోగార్థులు దళారులను నమ్మిమోసపోవద్దని పోలీసు అధికారులు చెబుతున్నా జిల్లాలో బాధితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇందులో పదిశాతం మంది కూడా ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్న దాఖలాల్లేవు. అనేకమంది పరువు పోతుందని, ఉన్నత చదువులు చదువుకుని కూడా మోసపోయారంటారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మోసాలకు గురైతే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
● నెల్లూరు చిన్నబజారు పరిధిలో నివాసం ఉంటున్న శివకుమార్‌కు ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని పొదలకూరురోడ్డుకు చెందిన ఓ వ్యక్తి, విజయవాడకు చెందిన మరో వ్యక్తి రూ.3.50 లక్షలు తీసుకుని మోసగించారు.
● ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4.71 లక్షల నగదు తీసుకుని ఆత్మకూరుకు చెందిన మహిళను మోసం చేశాడు.
● ప్రముఖ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలకు మాయమాటలు చెప్పి రూ.35 లక్షలను తీసుకున్నాడు.
● కలువాయికి చెందిన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని అల్లూరుకు చెందిన మహిళ నుంచి రూ.4.20 లక్షలు తీసుకుని ఆ తర్వాత పట్టించుకోలేదు.
● నెల్లూరు నగరానికి చెందిన వ్యక్తి బెంగళూరు, హైదరాబాద్‌ల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తానని కొందరి నుంచి రూ.17 లక్షలు తీసుకుని తర్వాత స్పందించలేదు.
● నెల్లూరు నగరానికి చెందిన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో ఓ యువకుడి నుంచి రూ.8 లక్షలు తీసుకున్నాడు.
●కలువాయికి చెందిన మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇపిస్తానని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ వద్ద రూ.4.25 లక్షలు తీసుకుని మోసగించింది.
నిరుద్యోగులను ముంచుతున్న
కేటుగాళ్లు
రూ.లక్షలు వసూలు చేస్తున్న వైనం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతోనే
అధికంగా మోసాలు
జిల్లా పోలీసు కార్యాలయానికి
వస్తున్న బాధితులు
అప్రమత్తంగా ఉండాలంటున్న
అధికారులు
Comments
Please login to add a commentAdd a comment