వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● పొలం వివాదమే కారణం
● బుచ్చిరెడ్డిపాళెంలో ఘటన
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని జెండాదిబ్బ రోడ్డులో పొలానికి సంబంధించి నెలకొన్న వివాదంలో వృద్ధ దంపతులు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం సుబ్బారెడ్డినగర్‌కు చెందిన గుంజి రమణయ్య, నాగమ్మలు జెండాదిబ్బ రోడ్డులోని ఓ రైతుకు చెందిన పొలాన్ని లీజుకు తీసుకుని కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. లీజు పొలానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ శివాయి భూమి 27 సెంట్లను కూడా వారే సాగు చేసుకుంటున్నారు. కాగా యజమాని మరొకరికి మొత్తం భూమిని విక్రయించాడు. అయితే ఆ శివాయి భూమి తమకే చెందుతుందని రమణయ్య, నాగమ్మ కొంతకాలంగా కొనుగోలు చేసిన వారితో మంతనాలు జరిపారు. వారు ఆ భూమి పూర్తిగా తమ పేరుపైనే ఉందని అడంగళ్, పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయని మీకెలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు. ఈ విషయమై వృద్ధ దంపతులు కోర్టుకు వెళ్లారు.
● శుక్రవారం పోలీసులు వృద్ధ దంపతుల్ని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఆ స్థలం కొత్తగా కొనుగోలు చేసిన వారిదేనని, తహసీల్దార్ ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. యజమానులు వివాదాస్పదమైన భూమిలో కూడా కంచె వేసేందుకు యత్నించారు. దీంతో రమణయ్య, నాగమ్మలు అడ్డుకున్నారు. ఇరువర్గాలకు ఘర్షణ జరిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. యజమానులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, తప్పుడు డాక్యుమెంట్లతో తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రమణయ్య, నాగమ్మలు పురుగు మందు తాగారు. అయినా యజమానులు కంచె వేసే పనిని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో దంపతులను 108 వాహనంలో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో వారి బంధువులు నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. నాగమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆమె కుమారుడు శ్రీనివాసులు తెలిపాడు. ఈ విషయమై ఎస్సై సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ రికార్డులు భూ యజమానుల వైపే ఉన్నాయన్నారు. వృద్ధ దంపతుల వద్ద రికార్డులు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సిందిగా సూచించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment