ఫీజు బకాయిలు చెల్లించాలి
● కలెక్టరేట్ ఎదుట పీడీఎస్‌యూ ఆందోళన
నెల్లూరురూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎం సునీల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగ సమస్యలు ఆ శాఖ మంత్రి లోకేశ్ పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఆరు నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వకపోవడంతో నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారన్నారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి వంటి పథకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి షారూఖ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థలను పట్టించుకోకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. సీఎం చంద్రబాబు విద్యారంగ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, లేదంటే రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కె ఆశిర్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్, నవీన్, హర్ష, వై పూజిత, చరణం, దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
పోలీస్ స్పోర్ట్స్ మీట్
నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి స్పోర్ట్స్ మీట్ ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించాల్సి ఉంది. వర్షాల కారణంగా 14కు వాయిదా వేశారు. వర్షాల కారణంగా కవాతు మైదానంలోని ట్రాక్, కోర్టులు దెబ్బతినడంతో ఆదివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు నీటి సంఘాల
ఎన్నికలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలకు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లకు, 3,698 టీసీలకు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.95 లక్షలు మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 9,120 మంది సిబ్బందిని నియమించారు. శనివారం ఉదయం 8 గంటలకు టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం)లకు సంబంధించి సర్వసభ్య మండలి సమావేశం ప్రారంభిస్తారు. 9 గంటల నుంచి అనుమతికి ఆమోదం తెలుపుతారు. గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, గ్రామ రెవెన్యూ అధికారి జారీ చేసిన గుర్తింపు పత్రం, తదితర ధ్రువీకరణలను బట్టి ఓటర్ లిస్టులో ఓటర్ వివరాలు సరైనవో కావో నిర్ణయిస్తారు. ఆ తర్వాత ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడి ఫామ్– 4.1, ఫామ్ –4.2, ఫామ్ –4.3, ఫామ్ –4.4 కాలాలను పరిశీలించి అభ్యర్థులను నిర్ణయిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నీటి సంఘాల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికను నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా, చేతులెత్తే పద్ధతి, రహస్య ఓటింగ్ పద్ధతుల్లో నిర్వహిస్తారు.
పైసా విదల్చని ప్రభుత్వం
నీటి సంఘాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.20 లక్షల ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే నిధుల మంజూరు లేకపోవడంతో ఎన్నికల ప్రత్యేకాధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూడుసార్లు వాయిదా వేసినా ఎన్నికలకు నిధులు కేటాయించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రైతుల కష్టాలను తీరుస్తామని చెప్పే ప్రభుత్వం సీజన్ మధ్యలో ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment