● నిందితులను కఠినంగా శిక్షించాలి
● ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్
● కొవ్వొత్తులతో నిరసన
నెల్లూరు (బారకాసు): జర్నలిస్టులపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికల కవరేజ్‌కి వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేశాయన్నారు. దాడిలో ‘సాక్షి’ రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాముకు గాయాలయ్యాయన్నారు. కెమెరా ధ్వంసమైందని తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామ్నా జిల్లాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో కొవ్వొత్తులతో తమ నిరసన తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడి చేయడం ఫ్యాషన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలు రాజకీయంగా చూసుకోవాలని కానీ జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐజేయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మస్తాన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే, టి.రమేష్‌బాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు, సామ్నా జిల్లా కార్యదర్శి హనుక్‌తో పాటు పలువురు ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment