హెల్త్ అసిస్టెంట్లను వీధిన పడేశారు
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తెలంగాణ కోర్టు తీర్పు పేరుతో తొలగించి వీధినపడేయడం దారుణమని ఏపీ హంస జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్‌కిరణ్ పేర్కొన్నారు. సంతపేటలోని హంస జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం వారు మాట్లాడారు. గుంటూరులోని మలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొల్లి లక్ష్మణరావు ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరమని చెప్పారు. నెల్లూరులో ఇప్పటికే 54 మందిని విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. తమను ఏ క్షణంలో తీసేస్తోరోననే భయంతో 110 మంది ఉన్నారని చెప్పారు. ఇక్కడి వైద్యశాఖ అధికారులు అత్యుత్సాహంతో పనిచేస్తూ కోర్టు నిబంధనలను పాటించలేదని విమర్శించారు. కోర్టు తీర్పు మేరకు మూడు నెలల ముందుగా నోటీసులిచ్చి, మూడు నెలలు జీతాలిచ్చి తీసేయాల్సి ఉన్నా, ఇలా వ్యవహరించకపోవడంలో గల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి ఉద్యోగాల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోశాధికారి మజరుల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment