ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

Published Sun, Dec 15 2024 12:46 AM | Last Updated on Sun, Dec 15 2024 12:46 AM

ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

నిర్బంధాలు.. ఏకపక్షంగా ఏకగ్రీవాలు

అధికార పార్టీలో

కుమ్ములాటలు

వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పలు చోట్ల అధికార పార్టీలో కుమ్ములాటలు బయట పడ్డాయి. ఏఎస్‌పేట మండలం జమ్మవరం, పెద్ద అబ్బీపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాదోపవాదాలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆత్మకూరు నియోజకవర్గంలోని బట్టేపాడు, చిన్నమాచనూరు, నాగినేనిగుంట సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

టీడీపీ కార్యవర్గ ఎన్నికల్లా..

సాగునీటి సంఘం ఎన్నికలు

ఏకపక్ష ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

అర్ధరాత్రి నుంచి నేతల నిర్బంధం

నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వని వైనం

ఏకగ్రీవం కాదనుకున్న చోట్ల

సర్టిఫికెట్లు చెల్లవంటూ అడ్డగింత

486 సంఘాల్లో వర్గాల

కుమ్ములాటలు, 9 సంఘాల ఎన్నికలు వాయిదా

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు అధికార పార్టీ దాష్టీకానికి పరాకాష్టగా నిలిచాయి. పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అడుగడుగున కూటమి నేతల దౌర్జన్యాలు.. కుట్రలు.. బెదిరింపులతో అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలకు పాల్పడ్డారు. ఆది నుంచి ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డదారిలో నిర్వహించేందుకు అధికార పార్టీ కుట్రలు చేయడంతో ఎన్నికలు సక్రమంగా జరగవని భావించి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ఎన్నికలను బహిష్కరించింది. అయినా గెలుపు ధీమా లేక.. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులతో అక్రమంగా నిర్బంధించారు. పోటీకి సిద్ధపడిన రైతులను నో డ్యూస్‌ సర్టిఫికెట్ల పేరుతో ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. అయితే పలుచోట్ల కూటమి నేతలే వర్గాలుగా విడిపోయి పోటీ పడ్డారు. కొన్ని చోట్ల ఘర్షణకు దిగారు. అధికార పార్టీ నాయకులే అధికారుల అవతారమెత్తి ఏకగ్రీవంగా కాకుండా ఏక పక్షంగా తమ వారు ఎన్నికై నట్లు ప్రకటించుకున్నారు. జిల్లాలో శనివారం 486 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అధికార పార్టీలోని వర్గపోరు కారణంగా 9 సంఘాలకు ఎన్నికలను వాయిదా వేశారు. మిగతా 477 సంఘాల ఎన్నికల ప్రక్రియను మమ అని పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లు ఎన్నికలను వాయిదా వేసింది. ప్రాజెక్ట్‌ కమిటీలను మినహాయించి 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 486 వాటర్‌ యూజర్‌ అసోసియేషన్లకు, ప్రాదేశిక నియోజకవర్గాలకు (సంఘాలకు) ఎన్నికలు జరిగాయి. 3,698 టీసీలకు ఎన్నికలు జరగ్గా అందులో 59 వాయిదా పడ్డాయి.

ఎన్నికల అధికారుల దాష్టీకాలు

ఏఎస్‌పేట మండలంలోని అబ్బీపురం, జమ్మవరం గ్రామాల్లో వివాదాస్పద పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ వర్గానికి మద్దతిస్తూ మంత్రి ఆనం ఇచ్చిన జాబితాలోని వ్యక్తులకు భూమి శిస్తు, నీటి తీరువా కట్టించుకొని రసీదులు అధికారులు అందజేశారు. అదే క్రమంలో మరో వర్గం వారికి నీటి తీరువా కట్టించుకోకుండానే అధికారులు వెళ్లిపోవడంతో ఆ వర్గం హైస్కూల్‌ గేట్లు బంద్‌ చేసి బైఠాయించి అధికారుల తీరుకు నిరసన వ్యక్తం చేశారు.

● ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం టీసీకి మెట్టా శ్రీనివాసులురెడ్డి, మాజీ సర్పంచ్‌ ఆమారి సుధాకర్‌ భార్య అమారి పాపమ్మ పోటీ పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి 36 ఓట్లు రాగా పామ్మకు 39 ఓట్లు లభించాయి. దీంతో దళిత మహిళ పాపమ్మ మూడు ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు విజేతగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి అఽధికారులను, పాపమ్మను బెదిరించి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించేలా చేశారు.

● వింజమూరు మండలం ఏ.కీస్తీపురంలో టీసీలకు నామినేషన్లు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన రైతులను పోలీసులే అడ్డకున్నారు. నోడ్యూస్‌ ధ్రువపత్రాలు వీఆర్వోలు ఇచ్చినా, అవి చెల్లవు తహసీల్దార్‌ కౌంటర్‌ సంతకం ఉండాలంటూ అధికారులు తిరస్కరించారు. వింజమూరు మండలం బుక్కపురంలో కూడా నోడ్యూస్‌ సర్టిఫికెట్లు అడ్డం పెట్టి పోటీకి సిద్ధపడిన రైతులను పోటీలో లేకుండా చేసి ఎన్నికను ఏకపక్షంగా జరిపించారు.

● కొండాపురం మండలం గానుగపెంటలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ వర్గీయుల మధ్య పోటీ ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. స్వల్ప ఓట్లు బలం ఉన్న కాకర్ల వర్గీయులకు అధికారులు, పోలీసులు మద్దతుగా నిలిచారు. దీంతో బొల్లినేని వర్గం తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలింగ్‌ బూత్‌ ముందు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో 160 ఓట్లు ఉంటే మాకు 150 బలం ఉన్నా,నామినేషన్లు వేసేందుకు నోడ్యూస్‌ సర్టిఫికెట్లల్లో తహసీల్దార్‌ సంతకం సాకుగా చూపారని వాపోయారు.

● చేజర్ల మండలం నాగులవెల్లటూరులో రెండు వర్గాల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.

● వెంకటాచలం మండలం కసుమూరు, కందలపాడులో రైతులు పార్టీలకతీతంగా నామినేషన్లు వేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.

● మనుబోలు మండలంలోని జట్లకొండూరులో పార్టీలకు అతీతంగా పోటీ చేసేందుకు సిద్ధపడిన రైతులను సమయం మించిపోయిందంటూ నామినేషన్లు స్వీకరించకుండా అధికారులు అడ్డుకున్నారు.

జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఖాకీల సాక్షిగా అప్రజాస్వామికంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీని అడ్డుకునేందుకు అధికార టీడీపీ నాయకులు అడ్డంగా బరితెగిస్తే.. ఖాకీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార పార్టీకి ఊడిగం చేశారు. ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మార్చుకున్నా ఫలితం దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకానికి పాల్పడ్డారు. ఏక పక్ష ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించినప్పటికీ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వేళ ఆ పార్టీ నేతలను అక్రమంగా స్టేషన్లలో నిర్బంధించి వేధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement