అంతర పంటలు అన్నివిధాలా మేలు | - | Sakshi
Sakshi News home page

అంతర పంటలు అన్నివిధాలా మేలు

Published Mon, Jun 17 2024 12:44 AM | Last Updated on Mon, Jun 17 2024 12:44 AM

అంతర

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాధారంగా కేవలం ఒకట్రెండు పంటలను నమ్ముకోకుండా మధ్యమధ్యలో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలకు చెందిన అంతర పంటలు వేసుకోవడం వల్ల మెట్ట వ్యవసాయం లాభసాటి అవుతందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి తెలిపారు. విస్తారంగా వర్షాలు నమోదైన నేపథ్యంలో ఖరీఫ్‌ పంటలు విత్తుకునేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. వివరాలు వారి మాటల్లోనే..

● తేలికపాటి నేలల్లో వాలుకు అడ్డంగా దుక్కి చేసుకుని తర్వాత పంటలు విత్తుకుంటే నేలతో తేమశాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వర్షాధారంగా అంతర పంటలు తప్పనిసరిగా వేయాలి. ఆరుతడి పంటలకు బోదే లేదా సాళ్లు లేదా ఎత్తుమడుల పద్ధతిలో విత్తుకోవాలి. ఒకవేళ ఎక్కువ వర్షాలు వచ్చినా నీటిని బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడానికి వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర విత్తనాలను తెగుళ్ల మందుతో విత్తనశుద్ధి (సీడ్‌ ట్రీట్‌మెంట్‌) చేసుకోవాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ దగ్గరదగ్గరగా ఒత్తుగా లేకుండా ప్రతి పంటలోనూ మొక్కల సాంద్రత పాటించాలి.

● వేరుశనగ సాగు చేసే రైతులు పొలాన్ని రెండు మూడు సార్లు దుక్కి చేసుకోవాలి. జూలై మాసం అంతా విత్తుకునేందుకు అనుకూలం. కే–6, కే–9, కదిరి హరితాంధ్ర, అనంత, ధరణి, కదిరి–లేపాక్షి, టీసీజీఎస్‌–1694 లాంటి విత్తన రకాలు అనువుగా ఉంటాయి. ఎకరాకు 50 నుంచి 60 కిలోలు విత్తనం అవసరం. విత్తే ముందు కిలో విత్తనానికి 1 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌తో శుద్ధి చేసిన తర్వాత ఒక గ్రాము టిబుకొనజోల్‌ అలాగే 10 గ్రాము ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి పాటించాలి. వేరుశనగ పొలం చుట్టూ రక్షణ పంటలుగా సజ్జ, జొన్న నాలుగు నుంచి ఆరు వరసలు విత్తుకుంటే కాండం కుళ్లు, వైరస్‌ తెగుళ్లను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగులు, తామరపురుగులను నివారించవచ్చు. 7 : 1 లేదా 11 : 1 లేదా 15 : 1 నిష్పత్తిలో వేరుశనగలో కంది లేదా సజ్జ పంటలు వేసుకోవాలి. విత్తే సమయం లేదా విత్తిన తర్వాత 20 నుంచి 30 రోజుల సమయంలో నీటి సంరక్షణ కోసం ప్రతి 3.6 మీటర్లకు ఒక తల్లిచాటు ఏర్పాటు చేసుకోవాలి.

● కంది సాగు చేసే రైతులు తేలికపాటి నేలల్లో మధ్యస్థ రకాలైన పీఆర్‌జీ–176, పీఆర్‌జీ–158, ఐసీపీఎల్‌–84031 విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. బరువు నేలల్లో ఎక్కువ కాలపరిమితి రకాలైన ఎల్‌ఆర్‌జీ–41, ఎల్‌ఆర్‌జీ–52, , ఎల్‌ఆర్‌జీ–105, టీఆర్‌జీ–59, ఐసీపీఎల్‌–85063, ఐసీపీఎల్‌–87119, బీఎస్‌ఎంఆర్‌ –786 రకాలు ఎంపిక చేసుకోవాలి.

● పత్తి విషయానికి వస్తే... ఎర్రనేలల్లో జూన్‌ నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో జూలై నుంచి ఆగస్టు 15 వరకు విత్తుకునేందుకు అనుకూలం. ఒక ప్రాంతంలో ఉన్న రైతులంతా దఫాలుగా కాకుండా వీలైతే స్వల్ప వ్యవధిలో ఒకేసారి విత్తుకుంటే తెగుళ్లు, చీడపీడల నివారణకు సులభమవుతుంది. బీటీ రకం విత్తనాలు ఎకరాకు 750 గ్రాములు నుంచి ఒక కిలో అవసరం. బీటీ రకం వేసుకుంటే పొలం చుట్టూ నాన్‌ బీటీ పత్తి లేదా కంది వేసుకుంటే కాయతొలచు పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. విత్తుకున్న 40 రోజులకు తప్పనిసరిగా ఎకరాకు 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వేసుకున్న ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం మొలకదశలో ఉంది. ఈ వాతావరణానికి వేరుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉన్నందున 3 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటర్‌ నీటికి కలిపి మొక్క వేరుమండలం తడిచేలా పోయాలి. ఈ సమస్య నివారణకు విత్తే సమయంలో కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసుకోవాలి.

● ఆముదం పంట విత్తుకునేందుకు జూన్‌ 15 నుంచి జూలై 31 వరకు అనుకూలం. హరిత, కిరణ్‌, జ్వాల, ప్రగతి లాంటి సూటి రకాలు అలాగే డీసీహెచ్‌–117, పీసీహెచ్‌–111, జీసీహెచ్‌–8, ఐసీహెచ్‌–66, ఐసీహెచ్‌–5 లాంటి హైబ్రీడ్‌ విత్తన రకాలు అనువుగా ఉంటాయి.

● వరి నారు మడులు పెంచుకునేందుకు జూన్‌ 15 నుంచి జూన్‌ 30 వరకు అనుకూలం. సాంబమసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోనా, నెల్లూరి మసూరి, నంద్యాల సోనా, ఎంటీయూ–1212, ఎంటీయూ–1280, ఎంటీయూ–1281 లాంటి రకాలు బాగుంటాయి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు నారుపోసే ముందు కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి.

వాలుకు అడ్డంగా దున్ని విత్తుకుంటే తేమశాతం పెరుగుదల

విత్తనశుద్ధి, మొక్కల సాంద్రత, కలుపు నివారణతోనే లాభసాటి

తెగుళ్ల నివారణకు వేరుశనగ,

పత్తి చుట్టూ రక్షణ పంటలు వేయాలి

ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు బి.సహదేవరెడ్డి, జి.నారాయణస్వామి వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment
అంతర పంటలు అన్నివిధాలా మేలు1
1/3

అంతర పంటలు అన్నివిధాలా మేలు

అంతర పంటలు అన్నివిధాలా మేలు2
2/3

అంతర పంటలు అన్నివిధాలా మేలు

అంతర పంటలు అన్నివిధాలా మేలు3
3/3

అంతర పంటలు అన్నివిధాలా మేలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement