అద్దె గూళ్లు.. అంగన్‌వాడీ కేంద్రాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించడంలో అంతులేని నిర్లక్ష్యం కనబడుతోంది. శిథిలావస్థకు చేరుకున్న కేంద్రాలకు సైతం మరమ్మతులు చేపట్టడం లేదు. దీనికి తోడు చేపట్టిన నిర్మాణాలను అర్ధంతరంగా వదిలేయడంతో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి.
నేటికీ అద్దె భవనాల్లోనే
పుట్టపర్తి మండలంలో 66 మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 32 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మిగిలిన వాటిలో 16 ప్రభుత్వ భవనాల్లో, 18 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయాకేంద్రాల్లో సరైన ఆట స్థలం లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి ఒక్కో భవనానికి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకూ అద్దె చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకూ భవన యజమానులకు అద్దె రూపంలో చెల్లించిన మొత్తంతోనే నూతన కేంద్రాలను నిర్మించవచ్చుననే వాదనలు వినవస్తున్నాయి. ఉన్న వాటిలోనూ కొన్ని నిర్వహణ లోపంతో పాడుబడ్డాయి. పైకప్పులపై చెత్తాచెదారం పేరుకు పోయి వర్షాలకు కారుతున్నాయి. దీంతో త్వరగా శిధిలావస్థకు చేరుకుంటున్న ఆయా కేంద్రాలకు చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.
శిథిలావస్థలో నాలుగు భవనాలు
జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రత్యేక నిధులను కేటాయించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాక్షికంగా దెబ్బ తిన్న భవనాలకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో అవి కాస్త శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మండలంలోని పెడపల్లి పెద్ద తండా, నిడిమామిడి కేంద్రాలే ఇందుకు నిదర్శనం. పెడపల్లి–1 కేంద్రం శిధిలావస్థకు చేరుకోవడంతో రెండేళ్ల క్రితం కూల్చి వేశారు. ఆ స్థలంలో నూతన భవన నిర్మాణంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో సదరు కేంద్రాన్ని పక్కనే ఉన్న ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. దిగువచెర్లోపల్లి గ్రామంలో 8 ఏళ్ల క్రితం గోడల వరకూ నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం ఆ గోడలు సైతం బీటలు వారాయి. పునాదిలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి రూ.7 లక్షల నిధులు కేటాయించగా రూ.2.8 లక్షలు వెచ్చించి పనులు ఆపేశారు. తాజాగా రూ.3 లక్షల నిధులు మంజూరైనా ప్రస్తుత నిర్మాణ వ్యయం పెరగడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
34 కేంద్రాలకు లేని సొంత భవనాలు
చిన్నారులకు ఆట స్థలం కరువు
త్వరగా పూర్తి చేయాలంటున్న లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment