వర్ధమాన క్రీడాకారుడి దుర్మరణం
పావగడ: కారు పల్లంలోకి పల్టీలు కొట్టిన ఘటనలో ఓ వర్ధమాన క్రీడాకారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చెందిన నవీన్‌బాబు (22) రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టులో కీలక క్రీడాకారుడిగా ఖ్యాతిగాంచాడు. శిర తాలూకా లోని బుక్కపట్న గ్రామంలో తన స్నేహితుడి ఇంట బుధవారం సాయంత్రం జరిగిన ఓ విందుకు ఐదుగురు స్నేహితులతో కలసి నవీన్‌బాబు హాజరయ్యాడు. రాత్రి కారులో తిరుగు ప్రయాణమైన వారు జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీని తప్పించబోయి అదుపు తప్పి మోరీని ఢీకొన్నారు. ఘటనలో కారు పల్టీలు కొడుతూ పల్లంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వెనుక తలుపు డోర్ విరిగి పోవడంతో పక్కనే కూర్చొన్న నవీన్‌బాబు బయటపడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నవీన్‌బాబు మృతదేహాన్ని గురువరం స్వగ్రామానికి చేర్చారు. ఒక్కగానొక్క కుమారుడి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తల్లితండ్రులు ప్రకాష్, సుజాతమ్మ గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్, గ్రామస్తులు... నవీన్‌బాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment