ఇంటర్ పరీక్షలకు వేళాయె
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరగనుండగా... చివరి రోజు (మార్చి 15వ తేదీ) జాగ్రఫీ పేపర్–2 పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా... విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎంఆర్, ఎన్‌ఆర్ షీట్లు, ఇతర సామగ్రి ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి.
జిల్లా నుంచి 23,987 మంది విద్యార్థులు..
జిల్లాలో మొత్తం 23,987 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరాని సంబంధించి 6,675 మంది బాలికలు, 6,408 మంది బాలురు కలిపి మొత్తంగా 13,083 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,781 మంది బాలికలు, 5,123 మంది బాలురు కలిపి 10,904 మంది పరీక్ష రాయనున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21 పోలీస్ స్టేషన్లలో పరీక్షా పత్రాలను భద్రపరిచారు.
పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించారు. అన్ని కేంద్రాల్లో ఫర్నీచర్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సమీపంలోని మరో కళాశాల నుంచి ఫర్నీచర్ సమకూరుస్తున్నారు. అలాగే 42 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి గదిలోనూ ఫ్యాన్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు.
సిబ్బంది నియామకం..
జిల్లాలోని 42 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా, 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. అలాగే తనిఖీల కోసం 2 సిట్టింగ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్ష నిర్వహణకు మొత్తంగా 460 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఒకరిని నియమించారు. వీరందరికీ ఇప్పటికే నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల తెలిసేందుకు సమావేశం కూడా నిర్వహించారు.
ఒకటో తేదీ నుంచి పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఇంటర్ పరీక్షలకు వేళాయె
Comments
Please login to add a commentAdd a comment