వేటు పడింది
● ‘కమర్షియల్ ట్యాక్స్’ అధికారుల
అవినీతిపై చర్యలు
● ‘పురం’ సీటీఓతో పాటు
ముగ్గురు డీసీటీఓల సస్పెన్షన్
హిందూపురం అర్బన్: ఆకస్మిక తనిఖీల పేరుతో వసూళ్లు చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై వేటు పడింది. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ నివేదిక ఆధారంగా సీటీఓ కృష్ణవేణి, డీసీటీఓలు ఇంతియాజ్ బాషా, రాజశేఖర్‌రెడ్డి, మధుసూదనరెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా త్వరలోనే మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి నలుగురు అధికారులపై వేటు పడటం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.
రెండు దఫాలుగా విచారణ..
హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై తోటి సిబ్బంది, కొందరు వ్యాపారులు ఫిర్యాదులు చేయడంతో ఈనెల 12వ తేదీన కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళి విచారణ జరిపారు. స్థానిక డీలర్లతో పాటు ఫిర్యాదుదారులతో విచారించారుు. అనంతరం సీటీఓ కార్యాలయంలో అధికారులతోనూ గోప్యంగా విచారణ చేపట్టారు. అయితే విచారణ నామమాత్రంగా సాగినట్లు ఆరోపణలు వెల్లవెత్తడంతో ఈ నెల 17వ తేదీన సమగ్ర విచారణ కోసం కమర్షియల్ ట్యాక్స్ రీజినల్ ఆడిట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ నాగేంద్ర, సంయుక్త కమిషనర్ శేషాద్రితో కలిసి సమగ్ర విచారణ చేశారు. ఫిర్యాదుదారులను, డీలర్లను మరోసారి విచారించారు. అప్పుడు కూడా తమకు అనుకూలంగా రిపోర్టు రాయించుకొనేందుకు స్థానిక కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నానా తంటాలు పడ్డారు. అవేమీ పట్టించుకోని రీజినల్ ఆడిట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ నాగేంద్ర పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈనేపథ్యంలోనే సీటీఓతో పాటు ముగ్గురు డీటీలపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.
రేపు కొత్తచెరువులో జాతీయ సైన్స్ దినోత్సవం
పుట్టపర్తి టౌన్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈనెల 28 తేదీన కొత్తచెరువులో నిర్వహించనున్నట్లు డీఈఓ కృష్ణప్ప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ‘‘సైన్స్ ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతను శక్తివంతం చేయడం’’ అనే అంశంపై ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో వక్తృత్వ, వ్యారచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి మండలం నుంచి ప్రథమ స్థానంలో నిలిచిన ఆరుగురిని ఎంపిక చేసి వివరాలను మండల విద్యాశాఖాధికారి గూగుల్ ఫామ్‌లో నమోదు చేసి గురువారం సాయంత్రంలోపు పంపాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులను ఈనెల 28 వతేదీ కొత్తచెరువులో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపాలన్నారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి తనూజ్ కుమార్‌ను 9492843184 నంబర్లో సంప్రదించాలన్నారు.
కాటి కోటేశ్వరం..
ప్రతిధ్వనించిన ఓంకారం
తాడిమర్రి: చిల్లవారిపల్లి సమీపంలో కాటికోటేశ్వర క్షేత్రంలో బుధవారం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. భక్తులు భారీగా తరలిరాగా ఓంకార నాదంతో క్షేత్రం ప్రతిధ్వనించింది. ముందుగా భక్తులు గదా గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్ భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే చిల్లవారిపల్లిలోనూ పోలీసులు భారీగా మొహరించారు.
వేటు పడింది
Comments
Please login to add a commentAdd a comment