‘పోలవరం’ ఎత్తు తగ్గించడమే సంపద సృష్టా?
అనంతపురం ఎడ్యుకేషన్: సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడమేనా అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్‌ల పేరుతో కాలువల్లో నీళ్లు పారించాలనుకుంటున్నారా... లేదంటే జేబుల్లోకి నిధులు పారించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హంద్రీ–నీవా కాలువను రైతులకు ఉపయోగపడకుండా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గతంలో చంద్ర బాబు 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తిరిగి 40 టీఎంసీలుగా మార్చారని గుర్తు చేశారు. పెరిగిన నీటి అవసరాలతో చివరి ఆయకట్టు ప్రాంతాలైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు నీళ్లు తీసుకెళ్లడం కష్టమని భావించి 2020లో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక జీఓ తెచ్చారన్నారు. అప్పట్లోనే ఈ స్కీం పనులు చాలావరకు పూర్తయ్యాయన్నారు. రాయలసీమలో రైతులు చల్లగా ఉండాలనే మంచి ఆలోచనతో జగన్ అడుగులేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు తగ్గించాలని గతంలో కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు చేసినా జగన్ ఒప్పుకోలేదన్నారు. చంద్రబాబు నేడు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎవరిని మోసగించడానికి మరో స్కీం?
‘చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల అవసరాల పోను పంపింగ్‌ను 15 రోజులు పెంచి రూ. 2,700 కోట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొస్తామంటున్నారు. నిజంగా మిగులుగా ఉంటే గండికోట రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల ప్రెజర్ టన్నెల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే స్కీంను ఎందుకు తీసుకొస్తారు’ అని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఇలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలన్నా కనీసం ఐదేళ్లు పడుతుందని,ఇప్పటికే చేపడుతున్న ప్రెజర్ టన్నల్ పనులు పూర్తి కావాలన్నా 6–7 ఏళ్లు పడుతుందన్నారు. ఈలోగా హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2.50 లక్షల ఎకరాల పొలాలు బీళ్లుగా మారతాయని వాపోయారు.
రాజకీయాలకు కేశవ్ స్వస్తి పలకడం మేలు!
ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తన నియోజకవర్గంలో ఉన్న పీఏబీఆర్ భూసేకరణకు డబ్బులివ్వాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పని చేయించలేకపోతే రాజకీయాలకు స్వస్తి పలకడం మేలని హితవు పలికారు. జగన్ హయాంలో చిత్రావతి ఆర్‌అండ్‌ఆర్‌కు సంపూర్ణంగా నిధులు ఇచ్చారని, గండికోటకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ పేరూరు నాగిరెడ్డి, నాయకులు బండి పవన్, మీనుగ నాగరాజు, జూటూరు శేఖర్, నీరుగంటి నారాయణరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అంగీకరించలేదు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment